ఇటీవల కర్ణాటకలో(Karnataka) జరిగిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) కీలక నేత హరీష్‌రావు(Harish Rao) తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ సమావేశంలో జరిగిన చర్చలు, కుదిరిన ఒప్పందాలపై (Agreements) తెలంగాణ ప్రజలకు (Telangana Peoples) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో 3 రాష్ట్రాల (Three States) ముఖ్యమంత్రులు(Chief Ministers), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధికారులు కూడా లేకుండా నలుగురే కూర్చుని ఏ నిర్ణయాలు తీసుకున్నారో వెల్లడించాలని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా కర్ణాటకలో నవేలి ప్రాజెక్టు(Naveli Project), ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) గుండ్రేవుల ప్రాజెక్టులను (Gundrevula Project) ముందుకు తీసుకెళ్తామని చెబుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి దానిని చారిత్రక ఒప్పందంగా అభివర్ణిస్తూ సంబరాలు చేసుకోవడం అత్యంత బాధాకరమని హరీష్‌రావు విమర్శించారు. గతంలో గుండ్రేవుల ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వబోమని ట్రిబ్యునల్ (Tribunal) స్పష్టం చేసినప్పటికీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ధైర్యంగా మళ్లీ ఆ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడానికి తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం బలహీన వైఖరే కారణమని ఆరోపించారు.
ఆర్‌డీఎస్‌కు (RDS) శాశ్వత నీటి కేటాయింపులపై ఏమైనా స్పష్టమైన హామీ వచ్చిందా అని ప్రశ్నించిన హరీష్‌రావు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) నీటి వాటాలపై కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రాజీ పడినా బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ హక్కుల విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధంగా ఉండదని స్పష్టం చేశారు.
గత 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సగటున ప్రతి ఏడాది కేవలం 4 టీఎంసీలకు(TMCs) మాత్రమే అనుమతులు సాధించగా, బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఏడాది సగటున 44 టీఎంసీలకు అనుమతులు తీసుకొచ్చామని హరీష్‌రావు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన మొత్తం 968 టీఎంసీల నీటిలో ఇప్పటికే 830 టీఎంసీలకు అనుమతులు సాధించామని, ఇంకా 138 టీఎంసీల అనుమతులు మాత్రమే రావాల్సి ఉందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మౌనంగా ఉందని హరీష్‌రావు విమర్శించారు. ఆ ప్రాజెక్టు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిద్రలేపింది కూడా బీఆర్ఎస్సేనని పేర్కొన్నారు.
పాలమూరు (Palamuru) పేరుతో సమ్మక్క-సారక్క ప్రాజెక్టును (Sammakka-Sarakka Project) రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హరీష్‌రావు ఆరోపించారు. తాగునీటి సమస్యతో పాలమూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు తెలంగాణలోని మేడిగడ్డ (Medigadda) గేట్ల మరమ్మతులు చేయలేని ప్రభుత్వం, తుంగభద్ర (Tungabhadra) గేట్ల మరమ్మతుల కోసం వెళ్లడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
హైడ్రా (HYDRAA) వ్యవహారంలో రేవంత్‌రెడ్డికి హిట్లర్ స్ఫూర్తిగా కనిపిస్తే, నీటి అంశంలో మాత్రం రోమ్ నగరం దగ్ధమవుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిని గుర్తు చేస్తున్నారని హరీష్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంపు మేస్త్రిగా వ్యవహరించిన రేవంత్‌రెడ్డి, తెలంగాణను ముంచే ముంపు మేస్త్రిగా మారొద్దని హితవు పలికారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ సుజలం, కర్ణాటక సుఫలం, తెలంగాణ మాత్రం నిష్ఫలంగా మారుతోందని హరీష్‌రావు ఆరోపించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ఒక్క చుక్క నీటిపైనా అన్యాయం జరిగితే కేసీఆర్(KCR), బీఆర్ఎస్(BRS) ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోరని హెచ్చరిస్తూ, తెలంగాణ నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.







