ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కుటుంభ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు (Heritage Foods Limited) భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) (FSSAI) నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సంస్థ తన ఉత్పత్తులపై వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు (Advertisements) చేస్తోందనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.
ప్రధానంగా హెరిటేజ్ విక్రయిస్తున్న పన్నీర్ ప్యాకేజింగ్‌పై ‘ఫ్రెష్ పన్నీర్'(Fresh Paneer) అనే పదాన్ని ఉపయోగించడంపై ఎఫ్ఎస్ఎస్ఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆహార భద్రత నిబంధనల ప్రకారం, “ఫ్రెష్” అనే పదాన్ని ఉపయోగించాలంటే నిర్దిష్ట ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. హెరిటేజ్ పన్నీర్ ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేదని, అందువల్ల ఈ పదం వినియోగదారులను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని నియంత్రణ సంస్థ పేర్కొంది.
అలాగే సంస్థ ఉపయోగిస్తున్న “హెల్తీ హ్యాపీనెస్”(Healthy Happiness) అనే ట్రేడ్‌మార్క్‌లోని “హెల్తీ” పదంపైనా ఎఫ్ఎస్ఎస్ఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. 2018 ఆహార ప్రకటనల నిబంధనల ప్రకారం, ఒక ఉత్పత్తి ఆరోగ్యాన్ని నేరుగా మెరుగుపరుస్తుందనే భావన కలిగించే పదాలను తగిన శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఉపయోగించరాదు. ఇలాంటి ప్రచారాలు వినియోగదారుల్లో తప్పుడు అభిప్రాయం కలిగించే అవకాశముందని ఎఫ్ఎస్ఎస్ఐ పేర్కొంది.
నివేదిక ప్రకారం, హెరిటేజ్ చేస్తున్న కొన్ని ప్రచార క్లెయిమ్‌లు శాస్త్రీయంగా నిరూపించబడలేదని, ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా లేవని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సంస్థకు నోటీసులు(Notices) జారీ చేసి, అభ్యంతరాలపై 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే జరిమానాలు లేదా ఇతర చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన సంస్థగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ప్రస్తుతం సంస్థ నిర్వహణలో నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari), నారా బ్రాహ్మిణి (Nara Brahmani) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల తిరుమల నెయ్యి (Tirumala Ghee) వివాదంలో కూడా హెరిటేజ్ పేరు ప్రస్తావనకు రావడంతో ఈ పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఇచ్చే వివరణ, అనంతరం ఎఫ్ఎస్ఎస్ఐ తీసుకునే తుది నిర్ణయంపైనే ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందన్నది చూడాలి.







