---Advertisement---

హైదరాబాద్‌లో బీభత్సం.. డ్రగ్స్‌ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు..!

July 27, 2026

Summarize with AI

---Advertisement---

హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్(Drugs) వ్యవహారంపై నిఘా నిర్వహిస్తున్న హెచ్-న్యూ పోలీసులపై (H-New Police) ఓ యువకుడు కారుతో దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. డ్రగ్స్ కొనుగోలు జరుగుతోందన్న పక్కా సమాచారంతో అబిడ్స్ ప్రాంతంలో నిఘా పెట్టిన పోలీసులపై నిందితుడు కారు దూసుకెళ్లడంతో కానిస్టేబుల్ (Constable) మహేందర్ యాదవ్ (Mahender Yadav) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్, ఓ ఇన్‌స్పెక్టర్‌కు కూడా స్వల్ప గాయాలు కాగా.. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు అబిడ్స్‌లో (Abids) డ్రగ్స్ కొనుగోలు జరుగుతోందన్న సమాచారం అందింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించిన ఆయన.. ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ (Inspector Srikanth) నేతృత్వంలోని ప్రత్యేక బృందంతో కలిసి అబిడ్స్ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో బ్లూ కలర్ బెలెనో కారు పాయల్ ఫుట్‌వేర్ సమీపానికి చేరుకోగా.. ఓ వ్యక్తి కారులో ఉన్న వ్యక్తికి అనుమానాస్పద ప్యాకెట్ అందజేయడం పోలీసులు గుర్తించారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో ఉన్న హుస్సేనీ ఆలం (Hussaini Alam) ప్రాంతానికి చెందిన సైఫ్‌కు (Saif) తమ ఐడీ కార్డులు చూపించి వాహనం నుంచి దిగాలని సూచించారు. అయితే కారు పక్కకు ఆపుతున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా రివర్స్‌లో వేగంగా వాహనాన్ని నడిపాడు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ (Mahender Yadav) కాలిపై (Leg) నుంచి కారు వెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో అప్రమత్తమైన ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ బృందం నిందితుడిని వెంబడించి అఫ్జల్‌గంజ్ (Afzalgunj) వద్ద కారును అడ్డుకుని సైఫ్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ ఆపరేషన్‌లో ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌లకు (Vamsidhar) కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాగా మహేందర్ యాదవ్ కాలికి ఫ్రాక్చర్ కావడంతో వెంటనే ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం హెచ్-న్యూ పోలీసులు సైఫ్‌ను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ వ్యవహారంతో పాటు ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment