పశ్చిమ ఆసియాలో (West Asia) హార్మూజ్ జలసంధి (Strait of Hormuz), ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో (Gulf of Oman) పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారతీయ నావికుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత 3 రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న 3 నౌకలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకోవడంతో సముద్ర భద్రత అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనల్లో 3 మంది భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడించాయి.
మృతుల్లో ఒకరు విశాఖపట్నానికి (Visakhapatnam) చెందిన 44 ఏళ్ల మెరైన్ ఇంజినీర్ (Marine Engineer) సురేష్ పట్నాలగా (Suresh Patnala) అధికారులు గుర్తించారు. ఢిల్లీలోని ఆంధ్రా భవన్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జూన్ 24న సురేష్ వివాహ వార్షికోత్సవం ఉండగా, అంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. సురేష్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో విశాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జూన్ 8న ఒమన్ ఆగ్నేయ తీర ప్రాంతంలో ‘మారివెక్స్’(Marivex) అనే ట్యాంకర్‌కు సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికా ఆంక్షలకు లోబడి ఉన్న ఈ నౌకపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
అనంతరం జూన్ 9, 10 తేదీల్లో ఒమన్ తీర ప్రాంతంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ (MT Settebello) అనే చమురు ట్యాంకర్‌కు సంబంధించిన ఘటన చోటుచేసుకుంది. ఈ నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా, వారిలో 21 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే 3 మంది భారతీయ నావికులు మృతి చెందినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది.
ఇక జూన్ 11న ‘ఎంటీ జల్వీర్’(MT Jalveer) అనే నౌకకు సంబంధించిన మరో సముద్ర భద్రతా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నౌకలో 21 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రాయబార కార్యాలయాల సమన్వయంతో సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు నమోదు కాలేదని నివేదికలు చెబుతున్నాయి.






