ఇండోనేషియాలో విషాదకర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్ కలిమంతాన్ ప్రావిన్స్‌లో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హఠాత్తుగా కూలిపోవడంతో అందులో ఉన్న 8 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ఎయిర్‌బస్ హెచ్130 హెలికాప్టర్ గురువారం ఉదయం మెలావి ప్రాంతంలోని ఓ తోట నుంచి బయలుదేరింది. అయితే ఎగిరిన కేవలం 5 నిమిషాల్లోనే రాడార్ నుంచి అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. అనంతరం సమీప అడవి ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయినట్లు గుర్తించారు.
ఈ ప్రమాదం ఎత్తైన కొండ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.
హెలికాప్టర్‌లో 6 మంది ప్రయాణికులు, 2 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా ఘటనలో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.
సైన్యం, పోలీసులు, రక్షణ సిబ్బంది భూమార్గం ద్వారా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ హెలికాప్టర్ మాథ్యూ ఎయిర్ నుసంతారా సంస్థకు చెందినదిగా గుర్తించారు. పామ్ ఆయిల్ కంపెనీ తోట పనుల కోసం దీనిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.






