ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో భాగంగా ఇవాళ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఈ కీలక పోరులో బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. వర్షం అంతరాయం ఉండే అవకాశాలు లేవని సమాచారం.
ఈ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ధర్మశాల పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఛేజింగ్ చేయడం కాస్త కష్టంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు.
అటు గుజరాత్ టైటాన్స్ జట్టు బలమైన ఫాస్ట్ బౌలింగ్ లైనప్‌తో పాటు విధ్వంసక ఓపెనర్లతో ఫుల్ కాన్ఫిడెన్స్‌లో కనిపిస్తోంది. మరోవైపు బెంగళూరు జట్టులో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ వంటి స్టార్ బౌలర్లు ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరే స్థాయిలో ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్ మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్‌గా మారింది.
దీంతో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు మాత్రం మరో అవకాశం ఉంటుంది. హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2లో తలపడాల్సి ఉంటుంది.






