ఐపీఎల్ 2026లో (IPL) 2026 ప్లే ఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠగా మారుతున్న వేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక విజయాన్ని నమోదు చేసింది. మే 18న చెపాక్ (Chepauk) వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు(SRH) 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై(CSK) గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయంతో గుజరాత్‌కు కూడా ఫైనల్-4 అవకాశాలు బలపడ్డాయి.
ఇప్పటికే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టగా.. ప్రస్తుతం 3 జట్లు తమ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, కేకేఆర్, సీఎస్‌కే మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
అయితే మ్యాచ్ కంటే ఎక్కువగా ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఇషాన్ కిషన్ (Ishan Kishan) ప్రవర్తనే. మ్యాచ్ అనంతరం చెపాక్‌లో ఉన్న సీఎస్‌కే అభిమానుల(CSK Fans) వైపు తిరిగి ఇషాన్ విజిల్ (Whistle) వేస్తూ సెలబ్రేట్ (Celebrate) చేశాడు. అంతేకాదు ‘మీ పని అయిపోయింది.. ఇక ఇంటికి వెళ్లండి’ అన్నట్లుగా సైగలు చేయడం వైరల్‌గా మారింది.
ఇషాన్ చేసిన ఈ చర్యపై సోషల్‌మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. చాలామంది నెటిజన్లు ఇది అవసరం లేని ఓవరాక్షన్ అంటూ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సీఎస్‌కే అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంత మైదానంలో ప్రత్యర్థి ఆటగాడు ఇలా గేలి చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
సీఎస్‌కే అభిమానులను విజిల్‌తో ట్రోల్ చేయడం ఈ సీజన్‌లో ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా సీఎస్‌కేపై విజయం అనంతరం పసుపు రంగు విజిల్‌తో ఫోటో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడు. దీంతో ఇప్పుడు మరోసారి ఇదే వివాదం తెరపైకి వచ్చింది.
‘విజిల్ పోడు’ (Whistle Podu) అనేది సీఎస్‌కే అభిమానుల భావోద్వేగ నినాదంగా పేరుంది. అలాంటి గుర్తింపునే టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లు ట్రోలింగ్‌కు దిగడం సరైంది కాదని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఓడిన జట్టు అభిమానులను మరింత రెచ్చగొట్టకుండా హుందాగా ప్రవర్తించాలని సూచిస్తున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. కానీ ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పారు.
ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. చివర్లో సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్ మ్యాచ్‌ను ముగించారు. ఈ కీలక ఇన్నింగ్స్‌కు గాను ఇషాన్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ ఓటమితో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. రుతురాజ్ నాయకత్వంలోని చెన్నై జట్టు ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.






