ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం (YSR Congress Government) తీసుకొచ్చిన ‘దిశ’ వ్యవస్థను (Disha System) కూటమి ప్రభుత్వం (Coalition Government) ఉపసంహరించుకోవడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రకటన విడుదల చేశారు.
జగన్ దిశను రద్దు చేయడం మహిళలు(Women), చిన్నారుల భద్రతకు (Children Safety) ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. మహిళలపై నేరాలను అరికట్టడం, వేగవంతమైన దర్యాప్తు, బాధితులకు తక్షణ రక్షణ, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన న్యాయం అందించేందుకు దిశను సమగ్ర వ్యవస్థగా రూపొందించామని వివరించారు.
దిశ యాప్ (Disha App) ద్వారా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌వోఎస్ (SOS) బటన్ నొక్కినా లేదా ఫోన్‌ను ఐదుసార్లు షేక్ చేసినా పోలీసులు నిమిషాల్లో స్పందించే వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. 1.51 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగా, దాని ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్‌కు పోలీసులు స్పందించి పరిష్కరించారని చెప్పారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు(Special Women Police Stations), గ్రామ, వార్డు సచివాలయాల్లో (Village and Ward Secretariats) 13,500 మంది మహిళా పోలీసులతో క్షేత్రస్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రత్యేక పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు.
లైంగిక నేరాల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను(Forensic System) బలోపేతం చేశామని, 13 ప్రత్యేక పోక్సో కోర్టులు(Special POCSO Courts), 12 మహిళా ప్రత్యేక కోర్టులు(Special Women Courts), 2.17 లక్షల మందికి పైగా లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటాబేస్ రూపొందించినట్లు తెలిపారు.
దిశ అమలుతో 2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గిందని పేర్కొన్నారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం ఏడు రోజుల్లోనే చార్జిషీట్లు (Charge Sheets) దాఖలు చేశామని, తీవ్రమైన కేసుల్లో 51 శాతానికి పైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేసినట్లు వివరించారు. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయని కూడా ఆయన పేర్కొన్నారు.
దిశ వ్యవస్థకు 19 జాతీయ అవార్డులు లభించాయని, అది కేవలం ఒక చట్టం కాదని, మహిళలకు రక్షణ కల్పించే సమగ్ర భద్రతా నెట్వర్క్ అని జగన్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత సరిపోతుందని, దిశ అవసరం లేదని చెబుతోందని, అయితే మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన శోశ్ వ్యవస్థ, మహిళా పోలీస్ స్టేషన్లు, గ్రామస్థాయి మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక కోర్టులకు బీఎన్ఎస్ ఎలా ప్రత్యామ్నాయం అవుతుందని ప్రశ్నించారు.
మహిళలు, చిన్నారులపై జరిగే తీవ్రమైన నేరాల్లో ఏడు పని రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, 14 పని రోజుల్లో కోర్టు విచారణ ముగించి మొత్తం 21 రోజుల్లో న్యాయం అందించాలన్న లక్ష్యంతో దిశను తీసుకొచ్చామని, ఆ లక్ష్యాన్నే తప్పుబట్టడం మహిళలకు తప్పుడు సందేశం పంపడమేనని విమర్శించారు.
దిశను రద్దు చేయడం వల్ల నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయం తగ్గుతుందని, బాధిత మహిళల్లో ప్రభుత్వంపై విశ్వాసం దెబ్బతింటుందని పేర్కొన్న జగన్, మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరగా ఆయన, “దిశను రద్దు చేయడం కాదు.. రక్షించాలి. నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలి” అని కూటమి ప్రభుత్వ నిర్ణయన్ని తీవ్రంగా తప్పు పట్టారు.







