ఎలాన్ మస్క్‌కు (Elon Musk) చెందిన స్టార్‌లింక్ (Starlink) భారత్‌లో(India) శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు (Satellite Internet Services) ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) స్పందించింది. టెలికాం రంగంలో పోటీకి తాము ఎప్పుడూ భయపడబోమని, స్టార్‌లింక్‌తో పాటు అన్ని సంస్థలకు స్వాగతం పలుకుతున్నామని తెలిపింది. అయితే, ప్రతి సంస్థ భారత చట్టాలు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని స్పష్టం చేసింది.
భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి కొన్ని వ్యాపార సంస్థలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రిలయన్స్ స్పందించింది. పోటీ వల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొంది.
2016లో జియో(Jio) ప్రారంభమైనప్పుడు తమకు వినియోగదారులు లేరని, ప్రస్తుతం ఆ సంఖ్య 53 కోట్లకు పైగా చేరిందని రిలయన్స్ వెల్లడించింది. దేశంలో డిజిటల్ సేవల విస్తరణకు, తక్కువ ధరలకు డేటా అందుబాటులోకి రావడానికి జియో దోహదపడిందని తెలిపింది.
శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలోకి వచ్చే దేశీయ, విదేశీ సంస్థలన్నింటికీ ఒకే విధమైన నిబంధనలు వర్తించాలని రిలయన్స్ అభిప్రాయపడింది. జియో కూడా శాటిలైట్ నెట్వర్క్ సేవల (Satellite Network Services) కోసం ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోందని వెల్లడించింది. స్టార్‌లింక్ ప్రవేశంతో భారత శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్లో పోటీ పెరిగి వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.








