జనసేన పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రద్దు చేయడంతో పాటు, కొత్త కమిటీలు ప్రకటించే వరకు ఎవరూ టీవీ డిబేట్లలో పార్టీ తరఫున పాల్గొనరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు పార్టీ వాణిని వినిపిస్తున్న అధికార ప్రతినిధుల బాధ్యతలు నిలిపివేయబడ్డాయి.
తెలుగు రాష్ట్రాల్లో జనసేన తరఫున మాట్లాడుతున్న సుమారు 26 మంది అధికార ప్రతినిధులు తమ బాధ్యతల నుంచి తప్పించబడ్డారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రస్తుతం 14 మంది అధికార ప్రతినిధులు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త కమిటీలు ప్రకటించే వరకు ఎవరూ మీడియాలో జనసేన పేరుతో పాల్గొనరాదని పార్టీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ క్రమశిక్షణ దెబ్బతిన్నదనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశారు. అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని కూడా రద్దు చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ నాయకుల మధ్య సఖ్యత లోపించడం, పార్టీ నియమాలను ఉల్లంఘించడం వంటి అంశాలను కారణాలుగా పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌తో పాటు మొత్తం కమిటీని రద్దు చేసిన పార్టీ, క్రమశిక్షణ ఉల్లంఘనలపై వివరణలు తీసుకోవాలని కేంద్ర కార్యాలయాన్ని ఆదేశించింది. కొత్త కమిటీ ఏర్పడే వరకు జిల్లా వ్యవహారాలను కేంద్ర కార్యాలయమే పర్యవేక్షిస్తుందని వెల్లడించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో జనసేనలో వరుసగా కమిటీలు, పదవులు రద్దు కావడం పార్టీ అంతర్గత పరిస్థితులపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పార్టీ ప్రక్షాళన పేరుతో ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ, పార్టీ ఏర్పడి 12 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో నిర్మాణాత్మక మార్పులు చేపట్టడం కార్యకర్తల్లో అనిశ్చితిని పెంచుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కొంతమంది నాయకులు, కార్యకర్తలు తమ పదవులు ఎప్పుడు రద్దవుతాయో తెలియని పరిస్థితుల్లో ఉత్సాహంగా పని చేయడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి పరిణామాలు పార్టీ కేడర్‌పై ప్రభావం చూపే అవకాశముందనే చర్చ జరుగుతోంది. మరోవైపు, ఈ చర్యలు పార్టీని మరింత క్రమబద్ధీకరించేందుకు చేపట్టిన సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగమా? లేక అంతర్గత అసంతృప్తికి సంకేతమా? అనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.







