జపాన్‌లో (Japan) మరోసారి ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. సోమవారం సాయంత్రం ఉత్తర జపాన్‌లో భారీ భూకంపం (Earthquake)సంభవించగా, అనంతరం సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. దీంతో తీర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
తీర ప్రాంతాలకు దూసుకొస్తున్న అలలు
సాయంత్రం 5 గంటల సమయంలో సాన్రికు తీరానికి సమీపంలో భూమి కంపించింది. సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం తర్వాత ఇవాటే ప్రాంతంలోని కుజీ ఓడరేవు వద్ద 80 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు నమోదయ్యాయి.
తీర ప్రాంతాలకు దాదాపు 10 అడుగుల ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.
జపాన్ ప్రధాని సనాయే తకైచి (Sanae Takaichi) పరిస్థితిని సమీక్షించి, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
రవాణా సేవలకు అంతరాయం
భూకంపం ప్రభావంతో రవాణా వ్యవస్థ దెబ్బతింది. టోక్యో నుంచి షిన్ అఒమోరి మధ్య నడిచే తోహోకు బుల్లెట్ రైలు సేవలను నిలిపివేశారు. యమగాటా, అకితా రైలు సేవలు కూడా ఆపివేశారు. ఇవాటే ప్రాంతంలోని స్థానిక రైళ్లు నిలిచిపోయాయి. హోక్కైడోలో కూడా కొన్ని మార్గాలు మూసివేశారు.
అయితే షిన్ చిటోస్, సెండాయ్ విమానాశ్రయాల సేవలకు ఎలాంటి అంతరాయం లేదని అధికారులు తెలిపారు.
మెగా భూకంపం భయం
తాజా ఘటనతో జపాన్‌లో మరోసారి మెగా భూకంపం భయం మొదలైంది. 8.0కు పైగా తీవ్రతతో వచ్చే భూకంపాలను మెగా భూకంపాలుగా పరిగణిస్తారు. జపాన్ 4 టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఉండటంతో అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.
రాబోయే 30 ఏళ్లలో భారీ భూకంపం వచ్చే అవకాశం 70 శాతం ఉందని గతంలో అంచనాలు వచ్చాయి. 2011లో 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం, సునామీ కారణంగా 22,000 మందికి పైగా మరణించారు.
ప్రస్తుతం వచ్చే 1 వారం పాటు ‘ఆఫ్టర్ షాక్స్’ ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.






