కడప (Kadapa) ప్రభుత్వ దంత వైద్య కళాశాల (Government Dental Medical College) లేడీస్ హాస్టల్‌లో (Ladies Hostel) ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో అందించిన ఆహారం తిన్న అనంతరం మొత్తం 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 27 మంది దంత వైద్య విద్యార్థినులుగా అధికారులు తెలిపారు.
మంగళవారం రాత్రి హాస్టల్‌లో దోశతో పాటు చట్నీ తిన్న విద్యార్థినులు (Students) బుధవారం తెల్లవారుజామున నుంచి వాంతులు, వికారం వంటి లక్షణాలతో అస్వస్థతకు (Illness) గురయ్యారు. మొదట 10 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురికాగా, అనంతరం మరో 20 మంది కూడా అస్వస్థతకు గురవడంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి క్యాజువాలిటీ విభాగానికి తరలించారు.
ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యుగంధర్ (Dr.Yugandhar) ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది విద్యార్థినులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, సిఎస్(CS) ఆర్ఎంఓ (RMO) డాక్టర్ శ్రీనివాసులు (Dr.Srinivasulu) పర్యవేక్షణలో వైద్య బృందం విద్యార్థినులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తోంది.
ఈ ఘటనపై స్పందించిన రిమ్స్(RIMS) అధికారులు విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ఎవరి పరిస్థితి కూడా విషమంగా లేదని, అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.
కడప దంత వైద్య కళాశాల హాస్టల్‌లో జరిగిన ఘటనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత (Savitha) ఆరా తీశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్‌లో ఉన్న మిగిలిన విద్యార్థినులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






