కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తెలంగాణలో (Telangana) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) (SIR) ప్రక్రియపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ (Kodangal) నియోజకవర్గంతో పాటు బోధన్ (Bodhan) నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు, చేర్పుల వ్యవహారంపై ఆమె పలు సంచలన ఆరోపణలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొడంగల్ నియోజకవర్గంలో సుమారు 30 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, అందులో పొరుగున ఉన్న కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని సెడం నియోజకవర్గానికి చెందిన 11 వేల మంది కొడంగల్‌లో ఓటర్లుగా నమోదయ్యారని ఆరోపించారు.
కొడంగల్ నియోజకవర్గంలోనే 22 వేల డూప్లికేట్ ఓట్లు (Duplicate Votes), 11 వేల కర్ణాటక ఓటర్లు ఉన్నారని, అంతే కాకుండా డూప్లికేట్ ఓట్ల సంఖ్యకు సమానమైన మెజారిటీతోనే రేవంత్ రెడ్డి విజయం సాధించారని కవిత పేర్కొన్నారు. దీంతో ముఖ్యమంత్రికి ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరించిందా అనే అనుమానం కలుగుతోందని, ఈ అంశంపై ఈసీ స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్(TRS) కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎస్‌ఐఆర్(SIR) ప్రక్రియలో పలు ఆశ్చర్యకర అంశాలు బయటపడుతున్నాయని కవిత ఆరోపించారు. ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఇప్పటివరకు 8 సార్లు ఎస్‌ఐఆర్ నిర్వహించగా, ప్రతి ఏడాది ఎస్‌ఎస్‌ఆర్ ప్రక్రియ జరుగుతుందని గుర్తు చేశారు. అయితే 2026లో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌కు 2026 జనవరి నాటి జాబితాను కాకుండా 2025 జనవరి నాటి ఎస్‌ఎస్‌ఆర్ జాబితాను ప్రామాణికంగా తీసుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఈ అంశంపై లోతుగా పరిశీలిస్తే విస్తుగొల్పే విషయాలు బయటపడుతున్నాయని కవిత అన్నారు. గత ఏడాదిన్నర కాలంలో బోధన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు తొలగించారని, ఆ ఓటర్లు ఇతర ప్రాంతాలకు మారారా, మరణించారా లేదా డూప్లికేట్ ఓట్లుగా గుర్తించారా అనే విషయాన్ని ఎన్నికల సంఘం వెల్లడించడం లేదని విమర్శించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి(CM) నియోజకవర్గమైన కొడంగల్‌లో మాత్రం కేవలం 808 ఓట్లు మాత్రమే తొలగించడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. బోధన్‌లో 7 వేల ఓట్లు తొలగిస్తే, కొడంగల్‌లో కేవలం 808 ఓట్లే ఎందుకు తొలగించారని నిలదీశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటన్నింటికీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు (Prakash Raj) 3 రాష్ట్రాల్లో ఓటు ఉందని చెబుతున్నారని, ఆ ఓట్లను తొలగించేందుకు 7 సంవత్సరాలు పట్టిందని కవిత (Kalvakuntla Kavitha) గుర్తుచేశారు. అయితే బోధన్‌లో మాత్రం కేవలం ఏడాదిన్నరలోనే 7 వేల ఓట్లు తొలగించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఒక నియోజకవర్గంలో 2 శాతానికి మించి ఓట్లను తొలగించాల్సి వస్తే ప్రతి ఓటరికి 3 సార్లు నోటీసులు ఇవ్వాలని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయని, కానీ అలాంటి నోటీసులు ఎవరికి అందలేదని ఆరోపించారు. ఒకవేళ ఇచ్చి ఉంటే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (G. Kishan Reddy) విదేశీయులకు భారతదేశంలో(India) ఓటు ఉండకూడదని చెబుతున్నారని, ఆ విషయానికి తాము కూడా అంగీకరిస్తామని కవిత అన్నారు. అయితే ఒక రాష్ట్రంలో ఓటు ఉన్న వ్యక్తి మరో రాష్ట్రంలో కూడా ఓటు నమోదు చేసుకునే అవకాశాన్ని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించే సమర్థమైన వ్యవస్థ ఎన్నికల సంఘం (Election Commission) వద్ద లేదని విమర్శించారు. అలాంటప్పుడు రూ.1,400 కోట్ల వ్యయంతో ఎస్‌ఐఆర్ నిర్వహించడం వల్ల అసలు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
ఎస్‌ఐఆర్ ద్వారా దేశవ్యాప్తంగా డూప్లికేట్ ఓట్లు పూర్తిగా తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని కవిత సూచించారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు ఇది దోహదపడాలని, వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు (One Nation, One Election, One Vote) అనే విధానం అమల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల మధ్య వలసలు, డూప్లికేట్ ఓట్ల అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అలాగే దేశంలో సంచార జాతుల ప్రజలకు ఓటు హక్కు ఎలా కల్పిస్తారో స్పష్టత ఇవ్వాలని సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులందరికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రాల మధ్య ఉన్న డూప్లికేట్ ఓట్లను కూడా ఎస్‌ఐఆర్ ద్వారా తొలగించగలిగితేనే ఈ ప్రక్రియకు నిజమైన అర్థం ఉంటుందని కవిత అన్నారు. ఎస్‌ఐఆర్ ఒక శాశ్వత పరిష్కారంగా మారాలని తాము కోరుకుంటున్నామని, కొత్త రాజకీయ పార్టీలకు పారదర్శక ఓటర్ల జాబితా అత్యంత కీలకమని పేర్కొన్నారు. తాము లేవనెత్తిన ప్రతి ప్రశ్నకూ ఎన్నికల సంఘం సమగ్రంగా సమాధానం ఇవ్వాలని వినమ్రంగా కోరుతున్నామని ఆమె తెలిపారు.







