కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India – ECI) నుంచి కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) ఊహించని పరిణామం ఎదురైంది. ఇటీవల ఆమె ప్రకటించిన ‘తెలంగాణ రక్షణ సేన’(Telangana Rakshana Sena) పార్టీ పేరును ప్రస్తుతం కొనసాగించడానికి అనుమతి ఇవ్వలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆ పార్టీ పేరుపై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు అందిన నేపథ్యంలో 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను (Alternative Party Names) సమర్పించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత గడువులో కొత్త పేర్లను సమర్పించకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ (Party Registration) దరఖాస్తును మూసివేస్తామని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం.
ఎన్నికల సంఘం పంపిన అధికారిక లేఖలో పార్టీ పేరుకు సంబంధించి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించడం సాధ్యం కాదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపై వివాదం నెలకొనడంతో దరఖాస్తును సవరించి 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని సూచించినట్లు సమాచారం. దీంతో కవిత కొత్త పార్టీ (Kavitha New Party) ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలో కీలక మలుపు చోటుచేసుకుంది.
అయితే ఎన్నికల సంఘం నిర్ణయంపై కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా కేవలం 2 అభ్యంతరాలు మాత్రమే అందాయని, వాటికి ఇప్పటికే పూర్తి వివరణతో సమాధానాలు పంపినట్లు వెల్లడించారు. మిగిలిన అభ్యంతరాల వివరాలను తెలియజేయకుండా ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలని కోరడం ఎలా సమంజసమని ఆమె ప్రశ్నించారు.
కొత్త పార్టీ పేర్లను సమర్పించే ఉద్దేశం తమకు లేదని కవిత స్పష్టం చేశారు. అవసరమైతే ‘తెలంగాణ రక్షణ సేన’ పేరును కొనసాగించేందుకు న్యాయపోరాటానికి కూడా సిద్ధమని ప్రకటించారు. పార్టీ పేరును కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని ఆమె వెల్లడించారు.
మరోవైపు, ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపై ప్రజల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు, అభ్యంతరాలు అందిన కారణంగానే 3 ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కోరినట్లు ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కవిత 15 రోజుల గడువులో ఎన్నికల సంఘం సూచనలను పాటిస్తారా లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.







