కేరళ(Kerala) రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) (UDF) కూటమి అధికారంలోకి వచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ (VD Satheesan) కేరళ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ గవర్నర్ (Kerala Governor) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar) ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు.
అదే వేదికపై పూర్తిస్థాయి మంత్రివర్గం కూడా కొలువుదీరింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో కలిసి మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అందరితోనూ దైవసాక్షిగా ప్రమాణం చేయించారు. కొత్త ప్రభుత్వంపై కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆశలు పెట్టుకున్నాయి.
ఈ చారిత్రాత్మక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనాయకత్వం భారీగా హాజరైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు కూడా ఈ వేడుకకు తరలివచ్చారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితర ప్రముఖులు హాజరై నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) కూడా కార్యక్రమానికి హాజరై వీడీ సతీశన్‌కు అభినందనలు తెలియజేశారు.






