జనసేన పార్టీ (Jana Sena Party) సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolishetty Satyanarayana) రాజీనామా వ్యవహారం (Resignation Issue) రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఆయన, తాను మాత్రం జనసేనలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించగా, కొద్దిరోజుల్లోనే పార్టీ నుంచి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం ఆయా వర్గాల్లో మరింత వివాదానికి దారితీసింది. ఈ పరిణామాలు పైకి బహిరంగంగా చెప్పకపోయినా ఆయనకు అవమానంగా మారాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో బొలిశెట్టి తన దృష్టిని పర్యావరణ అంశాలపై కేంద్రీకరించారు. ముఖ్యంగా పర్యావరణ శాఖ పనితీరుపై, అలాగే మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైఖరిపై ఆయన పదేపదే స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా కొల్లేరు సరస్సులో (Kolleru Lake) జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన రామ్సర్ సైట్‌గా (Ramsar Site గుర్తింపు పొందిన కొల్లేరు సరస్సు ప్రస్తుతం రాజకీయ స్వార్థాలకు బలైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2006లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ‘ఆపరేషన్ కొల్లేరు’ (Operation Kolleru) ద్వారా వేల ఎకరాల్లో అక్రమ చెరువులను తొలగించినప్పటికీ, ఆ తరువాత మళ్లీ భారీ స్థాయిలో ఆక్రమణలు జరిగాయని తెలిపారు. ప్రభుత్వ అఫిడవిట్ ప్రకారం సుమారు 17,771 ఎకరాలు తిరిగి ఆక్రమణకు గురయ్యాయని, వాస్తవానికి ఇది ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల కూటమి పాలన (Coalition Government రెండు సంవత్సరాల్లోనే సుమారు 6 వేల ఎకరాలకు పైగా కొత్తగా చేపల చెరువులు ఏర్పడినట్లు శాటిలైట్ మ్యాపులు సూచిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 11 ప్రాంతాల్లో కొత్త ఆక్రమణలు జరిగినట్లు గూగుల్ మ్యాప్స్ ఆధారంగా గుర్తించామని తెలిపారు.
పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే ఈ అంశంపై దృష్టి సారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. అలాగే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి ఈ విషయంపై పూర్తి ఆధారాలతో నివేదిక పంపుతున్నట్లు వెల్లడించారు. రాబోయే సమావేశంలో ఈ ఆక్రమణల తొలగింపుపై కఠిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.
కొల్లేరు వంటి చారిత్రక పర్యావరణ సంపదను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, లేకపోతే రాష్ట్రానికి ఇది శాపంగా మారే ప్రమాదం ఉందని బొలిశెట్టి హెచ్చరించారు.







