---Advertisement---

కేబినెట్ మీటింగ్‌లోనైనా కళ్లు తెరవండి.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఫైర్!

May 21, 2026

---Advertisement---

రాష్ట్రంలో ధాన్యం (Paddy) కొనుగోళ్ల (Procurement) వ్యవహారం తీవ్ర సంక్షోభంగా మారిందని, రైతులు (Farmers) కొనుగోలు కేంద్రాల వద్ద నరకయాతన అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (A. Revanth Reddy) గురువారం బహిరంగ లేఖ రాసిన ఆయన.. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2 నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడుతున్న అవస్థలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.

తెలంగాణ (Telangana) ఏర్పడ్డ తర్వాత 9న్నరేళ్ల పాటు ధైర్యంగా సాగుచేసుకున్న రైతు.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆందోళనలోకి నెట్టబడ్డాడని కేటీఆర్ ఆరోపించారు. రైతుకు అండగా కేసీఆర్ అమలు చేసిన ప్రతి పథకాన్ని గత 2న్నరేళ్లుగా నిర్వీర్యం చేశారని, మీ చేతకానితనంతో అన్నదాత వెన్ను విరిగిపోయిందని విమర్శించారు.

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో రోడ్లెక్కుతున్నారని, పంట అమ్ముకుందామని ఆశతో వచ్చిన రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారని అన్నారు. కొందరు రైతులు అక్కడికక్కడే గుండెపోటుతో కుప్పకూలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి (Delhi) 70 సార్లు వెళ్లడంలో చూపిన శ్రద్ధలో కనీసం 1 శాతం రైతులపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారు.

పెట్టుబడి సాయం (Investment Assistance) 4 సార్లు ఇవ్వకపోయినా, యూరియా (Urea) సమస్యలు సృష్టించినా రైతులు అన్నింటినీ భరించి పంట పండించారని.. కానీ ప్రభుత్వం మాత్రం ఆ పంటను కొనుగోలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా కొనుగోలు కేంద్రాల వైపు చూడలేదని ఆరోపించారు.

రైతులు తమ చేతులతోనే పండించిన పంటకు నిప్పు పెట్టుకునే దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై కాలిపోతున్న ధాన్యం కుప్పలు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యాలని అన్నారు. గత 30 నెలల్లో రైతులను మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి కష్టాల్లోకి నెట్టేశారని, సంతోషంగా సాగిన వ్యవసాయాన్ని కన్నీటి సేద్యంగా మార్చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విలువైన భూములను అమ్మి వేల కోట్లు దోచుకోవడంపైనే ప్రభుత్వానికి ఆసక్తి ఉందని, రైతుల పంటలు కొనాలన్న బాధ్యత మాత్రం కనిపించడం లేదని కేటీఆర్ విమర్శించారు. రోడ్లపై రైతుల నిరసనలు జరుగుతుంటే మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో (Kodangal) కూడా రైతులు రోడ్డెక్కి నిరసనలు చేపడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు.

వరంగల్ నుంచి ఖమ్మం వరకు అనేక జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో రోజుకు ఒక్క లారీ కూడా ఎత్తడం లేదని ఆరోపించారు. కొన్నిచోట్ల 10 కిలోలకుపైగా తరుగులు తీస్తున్నారని, గన్నీ బ్యాగుల కోసం రైతులే రూ.50 చొప్పున డిపాజిట్ చేయాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన బోనస్ హామీని కూడా ప్రభుత్వం మర్చిపోయిందన్నారు.

రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, లేకపోతే చరిత్రలో రైతు ద్రోహిగా మిగిలిపోతుందని కేటీఆర్ హెచ్చరించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం పర్యాటక వారోత్సవాలపై దృష్టి పెట్టడం దారుణమన్నారు.

కేసీఆర్(KCR) హయాంలో 3 నెలల ముందే కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేసి, గన్నీ బ్యాగుల నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేదాకా నిరంతర పర్యవేక్షణ ఉండేదని కేటీఆర్ గుర్తుచేశారు. కరోనా సమయంలో కూడా చివరి గింజ వరకూ కొనుగోలు చేసి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపారని అన్నారు. ఇప్పుడు అయితే అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్లు కూడా అందించలేని పరిస్థితి నెలకొన్నదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

బీఆర్ఎస్(BRS) హయాంలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాల కడలిలో ముంచేసిందని, ఇప్పటికే 1000 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. రైతుల ఆగ్రహం రోజురోజుకీ పెరుగుతోందని, 60 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాల్లో సరైన చర్యలు తీసుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

23న జరగనున్న కేబినెట్ సమావేశంలోనైనా (Cabinet Meeting) ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని కోరారు. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో శాశ్వతంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలిపోతుందని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment