రాజ్యసభ స్థానాల కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. జనసేన (Jana Sena) నుంచి ఒక స్థానానికి లింగమనేని రమేష్ (Lingamaneni Ramesh) పేరు ఖరారైనట్లు, అలాగే తెలుగుదేశం పార్టీ(TDP) నుంచి మూడు స్థానాలకు భాష్యం రామకృష్ణ(Bhashyam Ramakrishna), సానా సతీశ్(Sana Satish), చింతకాయల విజయ్ (Chintakayala Vijay) పేర్లు ఫైనల్ అయినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘకాలంగా రాజ్యసభ ఆశతో ఎదురుచూస్తున్న టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) కు మరోసారి నిరాశ ఎదురైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దళిత వర్గానికి చెందిన తనను ఈసారి అయినా పరిగణనలోకి తీసుకోవాలని వర్ల రామయ్య చేసిన అభ్యర్థన ఫలితం ఇవ్వలేదని, పార్టీ అధినాయకత్వం చివరి వరకు పరిశీలనలో ఉంచామన్న వివరణ ఇచ్చినా నిర్ణయం మారలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో, గతంలోనూ ఆయనకు అవకాశాలు దక్కకపోవడాన్ని కొందరు ప్రస్తావిస్తూ, పార్టీ లోపలి నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
2014, 2016, 2018 సంవత్సరాల్లో రాజ్యసభ సీట్ల (Rajya Sabha Seats) పంపకాల్లో (Allocation) తీసుకున్న నిర్ణయాలను ఉదాహరణగా చూపుతూ, వర్ల రామయ్యను పలుమార్లు పక్కన పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కీలక సందర్భాల్లో అవకాశాలు వేరే నేతలకు దక్కడం, ఆయనకు మాత్రం నిరాశ మిగలడం చర్చనీయాంశంగా మారింది.
ఇక 2019లో వైసీపీ(YSRCP) అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి గెలిచే అవకాశం ఏమాత్రం లేదని తెలిసినా, దళిత నేత వర్ల రామయ్యను పోటీకి దింపి అవమానానికి గురిచేశారని విమర్శలు ఉన్నాయి. నిజంగా ఆయనకు సీటు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఇప్పుడు అవకాశం ఇచ్చి న్యాయం చేయవచ్చుకదా అని ప్రశ్నిస్తున్నారు. గెలిచే అవకాశం లేనప్పుడు మాత్రం దళిత నేతలను పోటీకి దింపి, అవకాశం ఉన్నప్పుడు పక్కన పెట్టడం టీడీపీ అధిష్టానానికి పరిపాటిగా మారిందని పలువురు గుర్తు చేస్తున్నారు.
ఈ పరిణామాలపై దళిత సంఘాలు (Dalit Organizations) కూడా స్పందిస్తున్నాయి. వర్ల రామయ్యను కేవలం విమర్శల రాజకీయాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారా? పదవుల పంపకాల్లో మాత్రం ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీ నిర్ణయాలపై అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం వ్యవహారం మరోసారి టీడీపీ రాజ్యసభ ఎంపికలపై, అలాగే అంతర్గత సమీకరణాలపై కొత్త అనుమానాలకు దారితీసినట్లు కనిపిస్తోంది.






