జనగామ నియోజకవర్గంలోని (Jangaon Assembly Constituency) యశ్వంతాపూర్ (Yashwantapur) గ్రామంలో గత 15 రోజులుగా పంట కొనుగోళ్లు జరగక రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)స్వయంగా పరిశీలించారు. గ్రామానికి వెళ్లి రైతులను కలిసిన ఆయన, వారి సమస్యలను నేరుగా విని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట కొనుగోళ్లలో (Crop Procurement Process) జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతులు ఇప్పటికే ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోని అధికార యంత్రాంగంపై అసహనం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అక్కడి నుంచే మార్క్ఫెడ్ ఎండీతో (Markfed MD) ఫోన్లో మాట్లాడిన కేటీఆర్, వెంటనే పంట కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ధాన్యం, శనగలు, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం (Government Negligence) కొనసాగితే తీవ్ర ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరగకపోతే ఎక్కడికక్కడ రోడ్లెక్కి రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ కఠిన హెచ్చరిక జారీ చేశారు.
ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే పరిస్థితులు మరింత విషమిస్తాయని స్పష్టం చేశారు.






