బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్తో పాటు వయోభారానికి సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆయనను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం. 98 ఏళ్ల అద్వానీకి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
అద్వానీ శుక్రవారం రాత్రి సుమారు 7.30 గంటలకు ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం. ఆయనను పల్మనాలజీ విభాగంలో చేర్చి వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఛాతీలో ఇన్ఫెక్షన్తో పాటు వయస్సు కారణంగా ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు.
2026 మేలోనూ వయోసంబంధిత సమస్యలతో అద్వానీ ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందారు. అంతకుముందు 2024లో కూడా పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. అదే ఏడాది జూన్ 26న ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయనకు వివిధ విభాగాలకు చెందిన నిపుణులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు.
లాల్ కృష్ణ అద్వానీ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషించిన ఆయన 1999 నుంచి 2004 వరకు కేంద్ర హోంమంత్రిగా, 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ప్రజా జీవితానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2024లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.








