గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేస్తామని, మురుగునీటి సమస్యలను చిటికెలో మాయం చేస్తామని పాలకులు అట్టహాసంగా ప్రచారం చేసుకున్న వినూత్న సాంకేతికత.. ‘మ్యాజిక్ డ్రైన్’(Magic Drain). ‘పల్లె పండుగ 2.0(Palle Panduga 2.0) కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మురుగు సమస్య లేకుండా చేస్తామంటూ, ఇది ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)గారి ఆలోచన అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారే స్వయంగా రంగంలోకి దిగి పరిసీలించిన ఈ పథకం ఇప్పుడు పర్యావేక్షణ లోపంతో అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. పాలకుల అనాలోచిత నిర్ణయాలు, శాస్త్రీయత లేని ప్రయోగాలు చివరకు ప్రజాధనాన్ని మురుగుపాలు చేయడమే కాకుండా, సామాన్య ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నాయో చెప్పడానికి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం కుమ్మర వీధిలో నిలిచిన మురుగునీరే ప్రత్యక్ష సాక్ష్యం!
గత ఏడాది ఆగస్టు 2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారు స్వయంగా పెద్దాపురంలో (Peddapuram) ప్రయోగాత్మకంగా నిర్మించిన మ్యాజిక్ డ్రైన్‌ను ప్రారంభించారు. సాధారణ సిమెంట్ డ్రైన్ల నిర్మాణానికి లక్షల వ్యయం అవుతుండగా, ఇంటింటి మురుగునీరు పోవడానికి రూ. 90 వేల వ్యయంతో ఈ మ్యాజిక్ డ్రైన్లను నిర్మించవచ్చని ప్రచారం చేశారు. జాతీయ ఉపాధి హామీ మెటీరియల్ నిధులను (MGNREGS Material Funds) వీటికి కేటాయించారు. 2025 అక్టోబర్ 2 లోపు 100 గ్రామాల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా ఒక్కో జిల్లాలో నాలుగు గ్రామాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందంటూ ఊదరగొట్టారు.
కానీ, ఏడాది తిరగకముందే ఈ ‘మ్యాజిక్’ కాస్తా ‘మాయ’ అయిపోయి.. ప్రజల ముక్కుపుటాలు బద్దలయ్యే కంపు కొట్టే మురుగు గుంతగా మారింది. కాలువల్లో మట్టి, గులకరాళ్లు, ఇసుక, నల్ల కంకరలతో లేయర్లుగా వేసి, ప్రతి 50 మీటర్లకు ఒక ఇంగుడు గుంతను నిర్మించడం ఈ డ్రైన్ యొక్క ప్రధాన రూపకల్పన. ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు ఈ రాళ్ల గుండా ప్రవహించి ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకిపోతుందని, పైన మిగిలే చెత్తను సులభంగా క్లీన్ చేయవచ్చని అధికారులు సీఎంకు సత్ఫలితాలుగా నివేదించారు.
అయితే, మురుగునీటిలో ఉండే ఘనపదార్థాలు, ప్లాస్టిక్, బురద రాళ్ల మధ్య చేరి కాల్వలు పూడిపోవడంతో నీరు భూమిలోకి ఇంకడం పూర్తిగా నిలిచిపోయింది. పైగా, రాళ్లపై పేరుకుపోయిన మురుగునీరు గ్రీన్ స్లడ్జ్ (పాచి) లాగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ డ్రైన్ పై పొరగా ఉన్న కంకరను క్లీన్ చేద్దామని తీస్తే.. మురుగుతో పాటు వేల సంఖ్యలో దోమలు గుంపులుగా బయటకు వస్తున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలతో జీవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాజిక్ డ్రైన్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారి మానస పుత్రికగా ప్రచారం సాగింది. 2026 మే నెలలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో కూడా ‘పల్లె పండుగ 2.0’ లో భాగంగా 59 కిలోమీటర్ల లక్ష్యానికి గాను ఇప్పటికే 32.30 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం పూర్తయిందని, వీటిని నల్లరేగడి నేలలు ఉన్న డెల్టా ప్రాంతాల్లో, గిరిజన గ్రామాల్లో కూడా విస్తరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కానీ, స్థానిక నేలల స్వభావాన్ని, ఇంకుడు సామర్థ్యాన్ని, నిరంతరం వచ్చే మురుగు పరిమాణాన్ని అంచనా వేయకుండా శాస్త్రీయత లోపించిన డిజైన్లతో వీటిని నిర్మించడం వల్లే ఈ వైఫల్యం సంభవించింది. కేవలం ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని, క్షేత్రస్థాయి నిర్వహణను గాలికొదిలేయడం వల్ల నేడు గ్రామీణ ప్రజలకు నరకం దాపురించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్వయంగా సీఎం ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టే ఇలా కుప్పకూలి, ప్రజలు కనీసం ఇంట్లో నివసించలేక రోగాల బారిన పడుతుంటే.. ప్రభుత్వం నుండి కనీస స్పందన కరువైంది. అధికారులు ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపడం లేదు. ‘మ్యాజిక్ డ్రైన్లు’ అంటూ ఆర్భాటం చేసిన పాలకులు ఇప్పుడు దీనిపై ఎందుకు పెదవి విప్పడం లేదు? తక్కువ ఖర్చు పేరిట ఉపాధి హామీ ప్రజాధనాన్ని ఇలా అశాస్త్రీయ ప్రయోగాలకు తగలేయడం వెనుక చిత్తశుద్ధి ఏముంది? అంటూ పలు ప్రశ్నలు ఏదురవుతున్నాయి.
ఇప్పటికైనా మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ అధికారులు మొండిపట్టు వీడి, పెద్దాపురం ప్రజలను ఈ దుర్గంధపు కాలువల నుండి విముక్తి చేయాలని. ప్రజాధనానికి జవాబుదారీతనంతో మెలిగి, గ్రామాల పారిశుధ్యంపై నిజమైన చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని పరతిపక్షాల నుండి వినిపిస్తున్న మాట.






