ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) గిరిజన హక్కుల పరిరక్షణ (Tribal Rights Protection) కోసం మన్యం ప్రాంతం మరోసారి ఉద్యమ బాట పట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో (Paderu) వేలాది మంది గిరిజనులు 1/70 చట్టం (Tribals 1/70 Regulation) పటిష్ట అమలు, జీవో నంబర్ 3 పునరుద్ధరణను డిమాండ్ చేస్తూ భారీ “మన్యం గర్జన” (Manyam Garjana) నిర్వహించారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన పిలుపుతో తండోపతండాలుగా తరలివచ్చిన గిరిజనులు తమ అస్తిత్వం, భూమి హక్కులు, ఉద్యోగ రక్షణ కోసం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
ఈ ఉద్యమానికి అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి (Gumma Tanuja Rani) మద్దతు ప్రకటించారు. వైఎస్సార్సీపీ(YSRCP) ఎల్లప్పుడూ గిరిజనుల పక్షాన నిలుస్తుందని ఆమె స్పష్టం చేశారు. జీవో 3, 1/70 చట్టాల అంశాన్ని ఇప్పటికే పార్లమెంట్లో ఎనిమిది సార్లు ప్రస్తావించానని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
జీవో 3 చరిత్ర చూస్తే ఇది గిరిజన విద్యా హక్కులతో ముడిపడి ఉంది. 1986లో ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను స్థానిక గిరిజనులకే కేటాయించే విధంగా జీవో 275 జారీ కాగా, దానిని 1999లో సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసింది. అనంతరం 2000లో నాటి చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ప్రభుత్వంలో జీవో నంబర్ 3 ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించారు. అయితే, దీనిపై దాఖలైన పిటిషన్లపై విచారణ అనంతరం 2020లో సుప్రీంకోర్టు ఆ జీవోను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రద్దు చేసింది.
ఇక గిరిజన ప్రాంతాల్లో భూముల బదలాయింపును నియంత్రించే 1/70 చట్టాన్ని సవరించాల్సిందేనని స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) గతంలో చేసిన వ్యాఖ్యలు గిరిజన సంఘాల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. చట్టం బలహీనపడితే గిరిజనుల భూములు పూర్తిగా ప్రమాదంలో పడతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బినామీ పేర్లతో భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయని, మరోవైపు 1/70 చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన 1700 పిటిషన్లు గిరిజన హక్కులకు ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో అరకు వేదికగా జీవో 3ను పునరుద్ధరిస్తామని లేదా ప్రత్యామ్నాయ ఉత్తర్వులు తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని గిరిజన సంఘాలు విమర్శిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం గిరిజనుల పట్ల నమ్మకద్రోహమేనని ఆరోపిస్తున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఆగస్టు 8, 9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక మన్యం బంద్కు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు కూడా గిరిజన ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ, అవసరమైతే పదవులను సైతం త్యాగం చేయడానికి సిద్ధమని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 3 పునరుద్ధరణ, 1/70 చట్టం కఠిన అమలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని గిరిజనులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.







