---Advertisement---

మయామి ఎయిర్‌పోర్టులో విషాదం.. విమాన ప్రమాదంలో 5 మంది దుర్మరణం!

September 7, 2026

Summarize with AI

---Advertisement---

మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో(Miami International Airport) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పోర్టో రికోలోని(Puerto Rico) శాన్ జువాన్ (San Juan) నుంచి బయలుదేరిన అమెజాన్ ఎయిర్‌కు(Amazon Air) చెందిన బోయింగ్ 767-300 కార్గో విమానం (Boeing 767-300 Cargo Plane) ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి రన్‌వే దాటి రోడ్డుపైకి(Road) దూసుకెళ్లింది.

ఈ క్రమంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కొన్ని వాహనాలను విమానం ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతతో పరిసర ప్రాంతాల్లో భయానక పరిస్థితి నెలకొంది.

ఈ ప్రమాదంలో 5 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

గాయపడిన వారిని 5 మందిని అధికారులు వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 3 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మయామి ఫైర్ చీఫ్ రాయిడ్ జాదల్లా (Raide Jadallah) తెలిపారు.

ప్రమాదం కారణంగా మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఏడాదిలో అత్యంత రద్దీగా ఉండే లేబర్ డే వారాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ ఘటనపై మయామి-డేడ్ కౌంటీ మేయర్ డానియెల్ లెవిన్ కేవా (Daniella Levine Cava) స్పందించారు. ప్రమాదం జరిగిన కొన్ని సెకన్లలోనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు.

ప్రస్తుతం తమ ప్రధాన దృష్టి బాధితుల కుటుంబాలకు సహాయం చేయడం, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడం, సహాయక చర్యలను కొనసాగించడంపైనే ఉందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, విమాన ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పడానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment