---Advertisement---

ఐపీఎల్ అంటే వ్యాపారం మాత్రమేనా..? “క్రికెట్ ఎక్కడుంది?” అంటూ మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు!

April 30, 2026

---Advertisement---

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద కొనసాగుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) స్పిన్ బౌలింగ్ కోచ్(Spin Bowling Coach), శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ (Sri Lanka Legendary Spinner) ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. “ఐపీఎల్(IPL) ఇప్పుడు వ్యాపారంగా (Business) మారింది.. ఇందులో అసలు క్రికెట్ (Cricket) ఎక్కడుంది?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను షాక్‌కు గురిచేశాయి.

ప్రస్తుతం ఐపీఎల్‌లో బ్యాటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌పై (Mumbai Indians) 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, కేవలం 5 రోజుల వ్యవధిలోనే 265, 244, 229 వంటి భారీ టార్గెట్లు చేజ్ కావడం టోర్నీ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచింది.

ఈ పరిణామాలతో బ్యాటింగ్(Batting), బౌలింగ్ (Bowling) మధ్య సమతుల్యత పూర్తిగా దెబ్బతిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బౌండరీల దూరం పెంచితే సమస్య తగ్గుతుందా? అనే ప్రశ్నకు స్పందించిన మురళీధరన్.. “బౌండరీలు వెనక్కి జరిపినా పెద్దగా మార్పు ఉండదు. అసలు సమస్య పిచ్‌లలో ఉంది” అని స్పష్టం చేశారు.

“పిచ్‌లను బౌలర్లకు అనుకూలంగా మార్చితే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. టీ20 అభిమానులు వినోదం కోరుకుంటారు. వాళ్లకు కావాల్సింది ఫోర్లు, సిక్సర్లే. అందుకే ఈ టోర్నీని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోడక్ట్‌గా తీర్చిదిద్దారు. క్రికెట్ అభివృద్ధి కోసం కాదు. ఇప్పుడు ఇది భారీ వ్యాపారం” అంటూ మురళీధరన్ కుండబద్దలు కొట్టారు.

ముఖ్యంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’ (Impact Player) నిబంధనపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రూల్ కారణంగా జట్లకు అదనపు బ్యాటర్ లభిస్తున్నాడని, అందువల్ల వికెట్లు కోల్పోతామనే భయం లేకుండా బ్యాటర్లు తొలి బంతి నుంచే దాడికి దిగుతున్నారని చెప్పారు. ఈ నిబంధనను కనీసం 2027 వరకు కొనసాగించాలని ఐపీఎల్ యాజమాన్యం నిర్ణయించడంలో కూడా వ్యాపార కోణమే ప్రధానమని సూచించారు.

ఐపీఎల్ ఇప్పుడు మహిళలు, యువతలో మరింత క్రేజ్ సంపాదించిందని మురళీధరన్ తెలిపారు. ఒక సర్వే ప్రకారం 18-24 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో ఐపీఎల్ ఆదరణ 68 శాతం పెరిగిందన్నారు. కొత్త తరం ప్రేక్షకులకు విరాట్ కోహ్లీ బ్యాటింగ్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలాంటి యువ ఆటగాళ్ల విధ్వంసకర హిట్టింగ్ అంటేనే ఎక్కువ ఆసక్తి ఉందన్నారు.

పరుగుల వర్షంపై కొందరు కోచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రేక్షకులు దీన్ని ఆస్వాదిస్తున్నంతకాలం ఈ ధోరణి మారదని మురళీధరన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను, షేన్ వార్న్ వంటి దిగ్గజాలు బౌలింగ్ చేసినా ఈ పిచ్‌లపై పెద్దగా ప్రభావం చూపలేమని నిజాయితీగా అంగీకరించారు.

“మేము బంతిని తిప్పగలం. కానీ ఒక్కో ఓవర్‌లో 10 పరుగులు ఇస్తూ 4 ఓవర్లలో 40 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చేది. స్కోరును 200 లోపు నియంత్రించాలంటే మా లాంటి బౌలర్లు 3 లేదా 4 మంది జట్టులో ఉండాలి” అంటూ మురళీధరన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఐపీఎల్ భవిష్యత్తు వినోద దిశగా సాగుతుందా? లేక మళ్లీ క్రికెట్ సమతుల్యత వైపు మళ్లుతుందా? అన్న చర్చకు ఈ వ్యాఖ్యలు కొత్త ఊపు తీసుకొచ్చాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment