నీట్-యుజి పేపర్ లీక్ (NEET-UG Paper Leak) వివాదంపై దేశవ్యాప్తంగా ఐదు వారాల పాటు సాగిన విద్యార్థుల ఉద్యమం (Students Protest Movement) అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా (Resignation) చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఉద్యమంలో అధికార ఎన్డీయే కూటమికి (NDA Alliance) చెందిన నేతల కుటుంబ సభ్యులు విద్యార్థులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం మరింత ఆసక్తికర పరిణామంగా నిలిచింది.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ(TDP), బీజేపీ(BJP) మరియు అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) (AGP) నాయకుల కుమార్తెలు (Leaders Daughters) ఉద్యమానికి మద్దతు తెలపడం, నిరసనల్లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధికార కూటమిలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయా అనే ప్రశ్నలను ఈ పరిణామాలు తెరపైకి తెచ్చాయి.
ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి(TDP) చెందిన విజయవాడ ఎంపీ కేసినేని చిన్నీ (Kesineni Chinni) కుమార్తె (Daughter) కేసినేని స్నిగ్ధ (Kesineni Snigdha) విద్యార్థుల ఉద్యమానికి సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలిపారు. “మన దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. జవాబుదారీతనం అడిగినందుకు విద్యార్థులపై ఇంత క్రూరంగా బలప్రయోగానికి దిగుతారా?” అని ప్రశ్నించారు. ఆమె పంచుకున్న పోస్టుల్లో “భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాదు, ప్రజాస్వామ్యాన్ని (Democracy) ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది” “రాజీనామా లేఖ డ్రాఫ్ట్ చేయాలా?” వంటి నినాదాలు ఉన్న ప్లకార్డులు కూడా కనిపించాయి. ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేకపోతే విద్యార్థులు ఎవరిని ఆశ్రయించాలనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు.

అలాగే భువనేశ్వర్ (Bhubaneswar) బీజేపీ ఎంపీ(BJP MP) అపరాజితా సారంగి (Aparajita Sarangi) కుమార్తె అర్చితా సచిన్ రహర్ (Archita Sachin Rahar) ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సోషల్ మీడియా ద్వారా స్వాగతించారు. “నా కుటుంబం ధర్మేంద్ర ప్రధాన్‌కు మద్దతుగా ఉండవచ్చు. కానీ నేను విద్యార్థుల పక్షాన ఉన్నాను” అని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ఆ పోస్ట్‌ను తొలగించాలని ఒత్తిడి వచ్చిందని ఆ విషయాన్ని కూడా ఆమె తన స్టోరీలో పంచుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అనంతరం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా అందుబాటులో లేకపోవడం కూడా చర్చనీయాంశమైంది.

అస్సాం ప్రభుత్వంలో మంత్రి, ఏజీపీ (AGP) నేత కేశబ్ మహంత (Keshab Mahanta) కుమార్తె దిబిసా మహంత (Dibisa Mahanta) గౌహతిలో జరిగిన విద్యార్థుల నిరసనల్లో నేరుగా పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీకి చెందిన నేత కుమార్తె నిరసనల్లో పాల్గొనడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో అధికార కూటమి నేతల కుటుంబ సభ్యుల నుంచే కాక్రోచ్ ఉద్యమానికి మద్దతు రావడం కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని సృష్టించిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్షాలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.







