నెల్లూరు జిల్లాలో మరో అనుమానాస్పద మరణం తీవ్ర సంచలనంగా మారింది. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన మరువక ముందే, మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన దళిత యువకుడు ఏడుకొండలు పోలీసుల అదుపులోకి వెళ్లిన అనంతరం మృతి చెందడంతో తీవ్ర వివాదం చెలరేగింది.
విద్యుత్ మోటర్ల దొంగతనం కేసులో ఏడుకొండలుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, పోలీసులు మూడు రోజుల పాటు స్టేషన్లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా కొట్టారని, అనంతరం అతడు మృతి చెందాడని తెలిపారు. అయితే పోలీసులు మాత్రం విచారణ అనంతరం పంపించగా, ఏడుకొండలు గడ్డి మందు తాగడంతో మృతి చెందాడని చెబుతున్నారు.
స్టేషన్ సమీపంలో అపస్మారక స్థితిలో కనిపించిన ఏడుకొండలను గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు స్టేషన్లోనే కొట్టి చంపి ఆస్పత్రికి తరలించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మృతుడి సోదరి ధనమ్మ మాట్లాడుతూ, “నా తమ్ముడిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్లే చనిపోయాడు. చోరీ కేసులో తీసుకెళ్లినా కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మూడు రోజులు స్టేషన్లో ఉంచి హింసించారు. చనిపోయిన తర్వాత మాత్రమే ఆస్పత్రికి రావాలని చెప్పారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి గూడూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ఏడుకొండలు మృతదేహాన్ని మనుబోలు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి జాతీయ రహదారిపై ఉంచి ఆందోళన నిర్వహించారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ఇటీవల సాయికృష్ణ మృతి తర్వాత ఇప్పుడు ఏడుకొండలు మరణించడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.







