ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) హెచ్చరించారు. ఎరువుల ధరల పెరుగుదల(Fertilizers Price Rise), సముద్ర రవాణాలో అంతరాయాలు, షిప్పింగ్ వ్యయాలు పెరగడం వంటి పరిణామాలు ప్రపంచ ఆహార సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
ప్రపంచ ఆహార భద్రత ఎరువుల సరఫరాతో (Fertilizer Supply) ముడిపడి ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిలో(Strait of Hormuz) రవాణా సమస్యల కారణంగా ఎరువులను తరలించే నౌకలకు ఇన్సూరెన్స్ వ్యయాలు భారీగా పెరిగాయని, నౌకలు, కంటైనర్ల లభ్యత కూడా తగ్గుతోందని తెలిపారు.
మలక్కా జలసంధిలో ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని, అయితే అక్కడ కూడా రవాణాకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆమె అన్నారు.
ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్(India) ఇప్పటికే చర్యలు చేపట్టిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎరువులను దేశానికి తీసుకొచ్చే నౌకలపై పెరుగుతున్న ఇన్సూరెన్స్ భారాన్ని తగ్గించేందుకు ‘షిప్పింగ్ ఎమర్జెన్సీ ఫండ్’(Shipping Emergency Fund) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినా రైతులపై భారం పడకుండా భారత్ సబ్సిడీలు (Subsidies) అందిస్తోందని చెప్పారు. దేశీయంగా యూరియా, ఫాస్ఫేట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అయితే పూర్తి స్థాయిలో ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు కీలక దశకు చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇరు దేశాలు ముందుకు సాగేందుకు కొన్ని అంశాల్లో పరస్పర సర్దుబాట్లు అవసరమవుతున్నాయని పేర్కొన్నారు.
అమెరికా భారత్తో ఉన్న వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు ప్రస్తుత చర్చలకు భిన్నమైన మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు ఆమె తెలిపారు. సముద్ర రవాణా అంతరాయాలు, ఎరువుల ధరల పెరుగుదల కొనసాగితే దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి, ఆహార సరఫరాపై పడే అవకాశం ఉందని వివరించారు.








