ఎన్టీఆర్(NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌పై ఎప్పటినుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’(RRR) తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరగగా, ‘కేజీఎఫ్’(KGF) సిరీస్‌తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్‌గా నిలిచారు. దీంతో ఈ ఇద్దరి కలయికలో సినిమా అనగానే అభిమానుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరింది.
అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలం అయినా షూటింగ్(Shooting) మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో పలు ఊహాగానాలు వినిపించాయి. ప్రాజెక్ట్ ఆగిపోయిందా..? స్క్రిప్ట్‌లో మార్పులా..? డేట్స్ సమస్యలా..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది.
ఇలాంటి సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సీఈఓ చెర్రీ (Cherry) ఈ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్ ఇచ్చారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం సినిమా పనులు శరవేగంగా సాగుతున్నాయి. అన్ని ప్రీ ప్రొడక్షన్ (Pre Production) పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా టీమ్ పని చేస్తోందని తెలిపారు.
ప్రశాంత్ నీల్ సాధారణంగా తన సినిమాలను వేగంగా పూర్తి చేసే దర్శకుడిగా పేరుంది. కానీ ఈసారి ఆలస్యం కావడానికి బలమైన కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న హిందీ చిత్రం ‘వార్ 2’ (War 2) ఫలితం, మార్కెట్ అంచనాలు, పాన్ ఇండియా వ్యూహాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్లు సమాచారం.
ఎన్టీఆర్ స్టార్‌డమ్‌కు తగ్గట్టుగా కథ మరింత బలంగా ఉండాలని భావించిన ప్రశాంత్ నీల్, ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతోనే ఈ ప్రాజెక్ట్‌కు అదనపు సమయం తీసుకున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా షూటింగ్ ప్రారంభించి అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత వర్గాలు చెబుతున్నాయి.
ప్రశాంత్ నీల్ స్టైల్ మాస్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి వస్తే బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో కనిపిస్తోంది.
ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే.. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది..? షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది..? అనే ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.






