ప్రకాశం జిల్లా ఒంగోలులో కూటమి విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దామచర్ల వ్యవహారశైలితో టీడీపీ, జనసేన కార్యకర్తలే ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించిన బాలినేని.. కూటమిలో ఉన్నందుకే ఇంతకాలం ఓపిక పట్టానని, తన అనుచరుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో ఎమ్మెల్యేకు వాటాలు అందుతున్నాయంటూ బాలినేని చేసిన ఆరోపణలు ఒంగోలు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దామచర్లపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన డిమాండ్ చేశారు.
బాలినేని వ్యాఖ్యలతో కూటమి అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కూటమి ఐక్యతను ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేసిన జనసేన నేతలపై గతంలో చర్యలు తీసుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు బాలినేనిపై కూడా జనసేన అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందా? లేక ఆయన చేసిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
దామచర్ల దీనిపై ఎలా స్పందిస్తారన్నదానిపైనా ఉత్కంఠ నెలకొంది. బాలినేని వ్యాఖ్యలతో ఒంగోలులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.






