అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పంచదార్ల కొండ రెవెన్యూ భూముల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ గ్రావెల్ మైనింగ్‌పై (Illegal Gravel Mining) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేతల పోరాటం నేపథ్యంలో పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విచారణకు ఆదేశించినప్పటికీ, ఈ విచారణ కేవలం మొక్కుబడి చర్యగా మారాయని, చిన్నస్థాయి అధికారులను బాధ్యులను చేసి అసలు మైనింగ్ కార్యకలాపాల వెనుక ఉన్న పెద్దలను తప్పించుకునే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.
పంచదార్ల కొండపై జరిగిన మైనింగ్ కారణంగా పురాతన ఆలయాలు, జనధారలు, చారిత్రక ప్రదేశాలకు నష్టం వాటిల్లుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. అక్రమ తవ్వకాల వెనుక భారీ మొత్తంలో అవినీతి (Corruption) జరిగిందనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు (Comprehensive Investigation) అవసరమని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని (G. Kishan Reddy) మంగళవారం వైఎస్సార్‌సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath), కరణం ధర్మశ్రీ(Karanam Dharmasri), తనుజారాణి(Tanuja Rani), గురుమూర్తి(Gurumurthy), మేడా రఘునాథ్ రెడ్డి(Meda Raghunath Reddy), గొల్ల బాబురావు (Golla Babu Rao) కలిశారు. పంచదార్లలో అక్రమ మైనింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని, ఆ ప్రాంతాన్ని మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్‌గా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
పంచదార్లలో జరుగుతున్న గ్రావెల్ క్వారీ కార్యకలాపాలపై తక్షణ ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ (Field Inspection) నిర్వహించాలని మైనింగ్ అధికారులను ఆదేశించాలని నేతలు కోరారు. క్వారీ లీజులు(Quarry Leases), అనుమతి పొందిన సరిహద్దులు, ఆమోదిత మైనింగ్ ప్లాన్, అనుమతించిన తవ్వకాల లోతు, పరిమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. రెవెన్యూ, కడాస్ట్రల్, GPS/GIS రికార్డుల ఆధారంగా జాయింట్ సర్వే నిర్వహించి లీజు పరిధిని దాటి తవ్వకాలు జరిగాయా లేదా నిర్ధారించాలని కోరారు.
అనధికార క్వారీ, బ్లాస్టింగ్ కార్యకలాపాలు జరిగినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. తవ్విన గ్రావెల్ పరిమాణం, రవాణా వివరాలను పరిశీలించి అధిక తవ్వకాలు, అక్రమ రవాణా జరిగిందా అనే అంశాన్ని తేల్చాలని కోరారు. అలాగే ఏఎస్‌ఐ రక్షిత బౌద్ధ అవశేషాలు, ధర్మలింగేశ్వరస్వామి ఆలయం (Dharmalingeswara Swamy Temple) పరిసరాల్లో బ్లాస్టింగ్ వల్ల కలిగిన ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని విజ్ఞప్తి చేశారు.






