అనకాపల్లి జిల్లాలోని (Anakapalli District) చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పంచదార్ల కొండను అక్రమ మైనింగ్ నుంచి రక్షించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) చేపట్టిన పోరాటం కీలక మలుపు తిరిగింది. స్థానిక ప్రజల ఆందోళన, వైసీపీ నేతల నిరసనలు, ‘చలో పంచదార్ల’(Chalo Panchadarla) కార్యక్రమం ద్వారా పెరిగిన ఒత్తిడితో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మైనింగ్ కార్యకలాపాలను (Mining Operations) నిలిపివేస్తూ, పంచదార్ల ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా (No Mining Zone) ప్రకటించే దిశగా చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
పంచదార్ల కొండపై సుమారు 1200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం (Sri Uma Dharmalingeswara Swamy Temple) ఉంది. అక్రమ గ్రావెల్ మైనింగ్ (Illegal Gravel Mining) కారణంగా పురాతన జలధారలు కలుషితమవుతున్నాయని, ఆలయ పరిసరాల్లో బురద నీరు వస్తోందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ నేతలు గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath), కురసాల కన్నబాబు (Kurasala Kannababu) నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి, పంచదార్లను శాశ్వతంగా మైనింగ్ రహిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ పోరాటం తీవ్రత పెరగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని, జలధారల కలుషితంపై జాతీయ జలవిజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలతో విచారణ జరపాలని ఆదేశించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ఇదే సమయంలో విశాఖపట్నంలోని సింహాచలం కొండపై (Simhachalam Hill) జరుగుతున్న అభివృద్ధి పేరుతో పర్యావరణ ద్వంశంపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కోసం సింహాచలం కొండ వాలున ఉన్న సుమారు 160 ఎకరాల భూమిని కేటాయించడంపై పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేని ‘కేటగిరీ బి-2’ కింద ఈ ప్రాజెక్టును హడావిడిగా తీసుకెళ్లారని విమర్శలు వినిపిస్తున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాజెక్టు ముడసర్లోవ జలాశయం, కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నీటి అవసరం మరియు నిపుణులు అంచనా వేస్తున్న వినియోగం మధ్య భారీ వ్యత్యాసం ఉందన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.
పంచదార్లలో ప్రతిపక్షం, ప్రజా ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం, సింహాచలం వంటి అత్యంత సున్నిత ప్రాంతాల్లో మాత్రం కార్పొరేట్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తోందా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. పంచదార్లపై నిర్ణయం తీసుకునట్టే సింహాచలం కొండను కూడా రక్షించాలంటూ మేధావులు, పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.







