అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని చారిత్రాత్మక పంచదార్ల (Panchadarla) పుణ్యక్షేత్రం ప్రస్తుతం మైనింగ్ (Mining) కార్యకలాపాల కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాంబిల్లి మండలంలోని ఫణిగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి సుమారు 1200 ఏళ్ల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం మహాభారత కాలంలో పంచపాండవులు ఈ ప్రాంతాన్ని సందర్శించారని, ధర్మరాజు (Dharmaraja) ఇక్కడ శివలింగాన్ని (Shiva Linga) ప్రతిష్ఠించారని చెబుతారు. 14వ శతాబ్దానికి చెందిన శిలాశాసనాలు కూడా ఇక్కడి దేవుడు ధర్మలింగేశ్వరస్వామి అని పేర్కొంటున్నాయి.
ఈ ఆలయం చోళుల కాలం నాటిదిగా చరిత్రకారులు చెబుతున్న మాట . కొండపై నుంచి నిరంతరాయంగా ప్రవహించే ఐదు సహజ జలధారలు ఆలయ ప్రాంగణంలో కలవడం ఈ క్షేత్రం ప్రత్యేకతగా ఉంది. ఈ ఐదు ధారల కారణంగానే దీనికి మొదట ‘పంచధారలు’, అనంతరం ‘పంచదార్ల'(Panchadarla) అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. కార్తీకమాసం, మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు.
అయితే ప్రస్తుతం ఈ పవిత్ర కొండపై కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి రాగానే అక్రమ గ్రావెల్ మైనింగ్ (Illegal Gravel Mining) జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ యంత్రాలతో జరుగుతున్న తవ్వకాల వల్ల కొండపై పెద్ద గోతులు ఏర్పడి, సహజ జలధారల ప్రవాహం తగ్గిపోవడంతో పాటు నీటి రంగు కూడా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఐదు జలధారలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
స్థానికుల ఆరోపణల ప్రకారం, ఈ మైనింగ్ (Mining) కార్యకలాపాలకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు వినిపిస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చి కొండను ధ్వంసం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. సనాతన ధర్మం, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తోంది. అలాగే స్థానిక జనసేన(Jana Sena) ఎమ్మెల్యే కూడా ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంటోంది.
మైనింగ్‌కు వ్యతిరేకంగా స్థానిక గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో గనులు, భూగర్భ శాఖ తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అయితే శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు మరియు గుడివాడ అమర్నాధ్ (Gudivada Amarnath) పలు డిమాండ్లు చేశారు. ఈ నెల 21న ‘చలో పంచదార్ల'(Chalo Panchadarla) కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. పంచదార్ల కొండ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని, ప్రస్తుతం ఉన్న అన్ని మైనింగ్ లీజులను వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉత్తరాంధ్రలోని ఈ చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదను కాపాడేందుకు స్థానికులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించాయి. ఈ వివాదంపై ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల స్పందించకపోతే పొరు ఉదృతం చేస్తాం అని ప్రకా సంఘాలు ప్రతిపక్షాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు.







