ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)(SIR) ముసాయిదా ఓటర్ల జాబితాపై (Draft Voters List) ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)తో (CEO) రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలు, డూప్లికేట్ ఓట్లు (Duplicate Votes), ఇతర సాంకేతిక సమస్యలను ఎన్నికల కమిషన్ (Election Commission) దృష్టికి తీసుకెళ్లారు. సమావేశం ముగిసిన తర్వాత వైఎస్సార్సీపీ(YSRCP) మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మీడియాతో మాట్లాడారు.
ఆచూకీ లేని ఓటర్ల వివరాలను బూత్‌ల వారీగా అందించాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు పేర్ని నాని తెలిపారు. భార్యాభర్తల ఓట్లు వేర్వేరు బూత్‌ల్లో నమోదవడం, ఒక ప్రాంతానికి చెందిన ఓటర్లు మరో ప్రాంతంలో ఉండటం వంటి అనేక తప్పులను గుర్తించి వాటిని సరిచేయాలని కోరామని చెప్పారు. అయితే ఈ సవరణలన్నింటినీ ఓటర్లే చేసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారులు సూచించడం ఆశ్చర్యకరమని విమర్శించారు.
చిలకలూరిపేట(Chilakaluripet), నరసరావుపేట నియోజకవర్గాల్లో (Narasaraopet Constituencies) ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లు నమోదైన విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని పేర్ని నాని వెల్లడించారు. అలాంటి డూప్లికేట్ ఓట్లు ఎలా నమోదయ్యాయో ప్రశ్నించామని, ఈ విధానంలో వాటిని పూర్తిగా తొలగించడం ఎంతవరకు సాధ్యమవుతుందో అనుమానం వ్యక్తం చేశారు.
ఓటర్ల జాబితాను రూపొందించే బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని, అలాంటప్పుడు అందులోని తప్పులను సరిచేసే బాధ్యతను పూర్తిగా ఓటర్లపై (Voters) మోపడం సరైన విధానం కాదని పేర్ని నాని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలంటే జాబితాలోని లోపాలను కమిషనే స్వయంగా గుర్తించి సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.







