పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) కొనుగోళ్లకు సంబంధించి యూపీఐ (UPI) చెల్లింపులపై కొత్త నిబంధన వివాదానికి దారితీస్తోంది. రూ.2,000 కంటే ఎక్కువ మొత్తానికి ఇంధనం (Fuel) కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లిస్తే రూ.5 మర్చంట్ డిస్కౌంట్ రేట్ (Merchant Discount Rate – MDR) రుసుము విధించే ప్రతిపాదనపై పెట్రోల్ డీలర్లు (Petrol Dealers) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారాన్ని తొలగించాలని లేదా పెట్రోల్ పంపులకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (National Payments Corporation of India – NPCI) సవరించిన నిబంధనల ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు పైగా ఇంధన కొనుగోళ్లపై యూపీఐ చెల్లింపులకు రూ.5 రుసుము వర్తించనుంది. రూ.2,000లోపు లావాదేవీలకు ఈ ఛార్జీ ఉండదు.
ఈ ప్రతిపాదనను ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోలియం ట్రేడర్స్(Federation of All India Petroleum Traders) సహా ఢిల్లీ-ఎన్సీఆర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ముంబై, కర్ణాటక, రాజస్థాన్, జమ్ముకశ్మీర్ ప్రాంతాల డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. తమకు లీటరుకు రూ.2.40 నుంచి రూ.3.40 వరకు మాత్రమే కమీషన్ వస్తుందని, ప్రతి లావాదేవీపై రూ.5 రుసుము విధిస్తే ఆదాయ మార్జిన్‌పై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
తమ డిమాండ్లను అక్టోబర్ 15లోగా పరిష్కరించకపోతే రూ.2,000కు పైబడిన యూపీఐ చెల్లింపులను నిలిపివేసి నగదు లావాదేవీలను (Cash Transactions) మాత్రమే అనుమతిస్తామని పలు ప్రాంతాల డీలర్లు స్పష్టం చేస్తున్నారు. అదే జరిగితే వాహనదారులు, వాణిజ్య వాహనాల యజమానులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
అయితే మర్చంట్ డిస్కౌంట్ రేట్ రుసుము వ్యాపారులకు సంబంధించినదేనని, దాని భారాన్ని వినియోగదారులపై మోపకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కస్టమర్ల నుంచి అదనపు రుసుము వసూలు చేయకుండా పర్యవేక్షించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.








