విజయవాడ కృష్ణలంకలో పేరుపోగు క్రాంతికుమార్, విజయనగరం జిల్లా రామరాయపురంలో కళావతి, తెనాలిలో తిరుపతమ్మ, రెంటపాళ్లలో ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త నారాయణరెడ్డి వంటి పొలీస్ వేదింపుల ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో తాజాగా మరో ఆత్మహత్య కలకలం రేపింది.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన దరియా హుసేన్ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్ విడుదల చేయడం తీవ్ర సంచలనంగా మారింది. తన మరణానికి పూర్తి కారణం పిడుగురాళ్ల సీఐ శ్రీరామ్ వెంకట్రావు, అక్కడి పోలీసులు అంటూ దరియా హుసేన్ ఆరోపించారు.

సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకుని తనను, తన కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తున్నారని, కోర్టులో ఉన్న ఇంటి వివాదం విషయంలో ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆయన వీడియోలో పేర్కొన్నారు. మాట వినకపోతే ఇంట్లో గంజాయి ప్యాకెట్లు పెట్టి కేసు నమోదు చేస్తామని కానిస్టేబుల్ బెదిరించారని కూడా ఆరోపించారు.
రోజూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అవమానిస్తున్నారని, ఈ వేధింపులను భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్‌లో దరియా హుసేన్ పేర్కొన్నట్లు సమాచారం. తన పుట్టినరోజు రోజే ప్రశాంతత లేక జీవితాన్ని ముగించుకోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల రాష్ట్రంలో పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయని చర్చ జరుగుతోంది. పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం, సివిల్ వివాదాల్లో జోక్యం, ప్రైవేట్ సెటిల్‌మెంట్లు వంటి అంశాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.







