యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు (Prashna Ravan) కృష్ణా జిల్లా గన్నవరం కోర్టు (Gannavaram Court) 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 18 వరకు ఆయనను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం పోలీసులు(Police) ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు (Nellore Central Jail) తరలించారు. ఇప్పటికే నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్(Bail) పొందిన రావణ్‌పై తాజాగా నమోదైన ఐదో కేసులో కోర్టు రిమాండ్ విధించింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై(Pawan Kalyan) అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో బెయిల్‌పై విడుదలైన ప్రశ్న రావణ్‌ను ఆదివారం గన్నవరం పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు.
జనసేన నాయకుడు, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ (Garikipati Siva Shankar) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రశ్న రావణ్ నిషేధిత సంస్థ సీపీఐ (మావోయిస్టు) సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారంటూ గన్నవరం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అనంతరం వేంపాడు టోల్గేట్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ కేసులో ప్రశ్న రావణ్‌పై బీఎన్ఎస్లోని (BNS) సెక్షన్లు 147, 148, 152, 192, 197(1)(డి), 353(1)(బీ)తో పాటు యూఏపీఏ(UAPA) చట్టంలోని సెక్షన్లు 13, 39 కింద కేసులు నమోదు చేశారు. నిషేధిత సంస్థ సీపీఐ (మావోయిస్టు)కు మద్దతుగా, వారి తీవ్రవాద సిద్ధాంతాలను ప్రోత్సహించే వీడియోలు ప్రచారం చేశారనే ఆరోపణలను ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆదివారం ప్రశ్న రావణ్‌ను గన్నవరం కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఈ నెల 18 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.






