యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసభ్యకర వీడియో పూర్తిగా (ఏఐ) సాయంతో రూపొందించిన నకిలీ వీడియో అని ఆయన భార్య బచ్చలకూర అనూష ఆరోపించారు. కేవలం తన భర్త ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాడనే కారణంతో ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి మార్ఫింగ్ వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు.
పత్రికా ప్రకటన విడుదల చేసిన అనూష, వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. కొందరు తమ తప్పులను సమర్థించుకునేందుకు లేని వీడియోలను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే, తన భర్త కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కుల, మత విద్వేషాలకు తమ కుటుంబం పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేస్తూ, ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో తన భర్త అధికారిక పేరు “రావణ్” అని, ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారని తెలిపారు.
రావణ్‌ను ఒక రాజకీయ పార్టీకి లేదా వర్గానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ, తమకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదని అనూష స్పష్టం చేశారు. గొంతులేని వర్గాలకు గొంతుకగా నిలవడమే రావణ్ లక్ష్యమని, సమాజంలో రాజ్యాంగబద్ధ పాలన, ప్రజాస్వామ్య విలువలు బలపడాలన్నదే ఆయన సిద్ధాంతమని వివరించారు.
ప్రశ్నించడం రావణ్ స్వభావమని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించడం తప్పు కాదని ఆమె అన్నారు. సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అధికారులదేనని, లోపాలను సరిదిద్దాల్సింది పోయి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటం అన్యాయమని విమర్శించారు.

కేవలం ప్రశ్నిస్తున్నాడనే కారణంతో రావణ్‌పై ఉగ్రవాదిని పోలిన విధంగా కేసులు నమోదు చేయడం దారుణమని పేర్కొన్న ఆమె, రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
తమకు ప్రభుత్వంతో పోరాడే శక్తి లేకపోయినా నిజాయితీపై విశ్వాసం ఉందని, న్యాయస్థానాలు మరియు రాజ్యాంగ వ్యవస్థలపై తమ కుటుంబానికి పూర్తి నమ్మకం ఉందని అనూష తెలిపారు. చివరగా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తూ, ప్రజాస్వామ్యవాదులు రావణ్‌కు అండగా నిలవాలని కోరారు.






