ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని(Visakhapatnam) ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో(MVP Colony Police Station) కేసు నమోదైంది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి(Marriage) పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎంవీపీ కాలనీ పోలీసులు ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు (Women Police Station) బదిలీ చేశారు.
పెళ్లి పేరుతో మోసం చేశారంటూ ఆరోపణలు
రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డి (Karvarapu Rahul Reddy) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకుని మోసం చేశాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తనను బెదిరించడంతో పాటు పరువు నష్టం కలిగించారని, దొంగతనానికి పాల్పడ్డారని, తన ప్రాణాలకు హాని కలిగించేలా ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ కేసులో రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj), రాహుల్ రెడ్డితో పాటు కొంతమంది న్యాయవాదులు(Lawyers), జర్నలిస్టుల(Journalists) పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో(FIR) చేర్చినట్లు సమాచారం.
గతంలోనే ఫిర్యాదు.. తాజాగా వెలుగులోకి
కాగా, బాధితురాలు గతంలో 2026 మార్చి 10న రాహుల్ రెడ్డిపై మాత్రమే నగర పోలీస్ కమిషనర్‌కు (City Police Commissioner) ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే సుమారు 3 నెలల తర్వాత జూన్ 11న మరో ఫిర్యాదు చేసి అదనంగా 11 మంది పేర్లను చేర్చినట్లు సమాచారం. దీంతో కేసులో నిందితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాహుల్ రెడ్డి నుంచి బాధితురాలు కోరిన రూ.1 కోటి డిమాండ్ నెరవేరకపోవడంతోనే ఇతర ప్రముఖుల పేర్లను కేసులో చేర్చారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. కేసు దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. నిందితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.







