ఐపీఎల్ 2026 (IPL 2026) ఫైనల్‌లో (Final) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు అద్భుత ప్రదర్శనతో మరోసారి చాంపియన్‌గా (Champion) నిలిచింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు కేవలం 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్(GT) ముందుగా బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు.
ఓపెనర్‌గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) మొదటి నుంచే గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్ 4 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి కగిసో రబడా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) 13 బంతుల్లో 15 పరుగులు చేసి రషీద్ ఖాన్‌కు (Rashid Khan) వికెట్ ఇచ్చాడు. కృనాల్ పాండ్య కూడా 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి అదే బౌలర్ చేతిలో అవుట్ అయ్యాడు. వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం అసాధారణమైన ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ కొనసాగించాడు.
కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 42 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతడు జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో బౌండరీల వర్షం కురిసింది. లక్ష్యాన్ని ఆర్‌సీబీ ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించి ట్రోఫీని అందుకుంది.
కోహ్లీ అంటే పరుగుల పిచ్చి.. రికార్డుల వేట. ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని రికార్డులు నెలకొల్పినా ప్రతి మ్యాచ్‌లో తనను తాను కొత్తగా నిరూపించుకోవాలనే తపన అతడిలో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో 65కి పైగా అర్ధశతకాలు చేసిన కోహ్లీ.. తన కెరీర్‌లోనే వేగవంతమైన ఫిఫ్టీని ఫైనల్ వంటి అత్యంత కీలకమైన మ్యాచ్‌లో నమోదు చేయడం విశేషం.
ఈ మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ దూకుడుగా ఆడతాడని, కోహ్లీ అతనికి సహకరిస్తాడని అందరూ భావించారు. కానీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. కోహ్లీ మొదటి నుంచే కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్ వంటి ప్రధాన బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కేవలం 12 బంతుల్లోనే 35 పరుగులు చేసి గుజరాత్ శిబిరంలో ఆందోళన రేపాడు.
పవర్‌ప్లే అనంతరం గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudharsan) స్లెడ్జింగ్ ద్వారా కోహ్లీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అతడు ఏమాత్రం స్పందించలేదు. తన ఆటపైనే పూర్తి దృష్టి సారించి ప్రత్యర్థికి బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. అదే అతని పరిపక్వతను మరోసారి నిరూపించింది.
మ్యాచ్ మధ్యలో కోహ్లీ కాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. 10వ ఓవర్ సమయానికి క్రాంప్స్ సమస్య ఎదురైనా అతడు వెనక్కి తగ్గలేదు. మధ్య మధ్యలో నీరు తాగుతూ శరీరాన్ని సిద్ధంగా ఉంచుకుంటూ తన పోరాటాన్ని కొనసాగించాడు. అర్ధశతకం పూర్తయిన తర్వాత కూడా ఎలాంటి సంబరాలు చేయకుండా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ నీళ్లు పంపించమని సూచించాడు.
ఇలాంటి చిన్న సంఘటనలే కోహ్లీ కట్టుబాటు, అంకితభావం, పోరాట పటిమకు నిదర్శనంగా నిలుస్తాయి. జట్టు విజయమే లక్ష్యంగా ప్రతి క్షణం ఆలోచించే అతని వైఖరి యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తుంది. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్ కేవలం మ్యాచ్ గెలిపించిన ప్రదర్శన మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే గొప్ప పాఠంగా కూడా నిలిచిపోతుంది.






