గ్లోబరీనా సంస్థపై (Globarena Company) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. ఆ సంస్థ తన బినామీ కంపెనీ అని చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపించామని తెలిపారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, లేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తాను లై డిటెక్టర్ పరీక్షకు (Lie Detector Test), సీఐడీ విచారణకు (CID Investigation) కూడా సిద్ధమని స్పష్టం చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి తన కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సిట్(SIT), సీఐడీ(CID) విచారణకు సిద్ధమా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
గ్లోబరీనా సంస్థ నిజంగానే తన బినామీ కంపెనీ అయితే అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎందుకు ఒప్పందాలు చేసుకుందని కేటీఆర్ నిలదీశారు. ఒకవైపు ప్రభుత్వమే ఆ సంస్థతో అగ్రిమెంట్లు చేసుకుని, మరోవైపు అది తన బినామీ సంస్థ అని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వరంగల్ పర్యటనలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్ భవన్ ముందు చేయాల్సిన ధర్నా కొడంగల్లోనా?
కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పేరును ప్రస్తావించరని కేటీఆర్ విమర్శించారు. మోడీ పేరును చెప్పడానికి కూడా రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజ్ భవన్ (Raj Bhavan) ముందు ధర్నా చేయాల్సిన చోట కొడంగల్‌లో (Kodangal) ధర్నా చేయడం కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని వ్యాఖ్యానించారు.
పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో(BJP) రాజకీయాలు చేస్తున్నది రేవంత్ రెడ్డేనని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్‌కు 1 మూట, బీజేపీకి 2 మూటలు పంపుతున్నట్టే ఆయన పాలన సాగుతోందని సెటైర్లు వేశారు. ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.






