రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ (Free Bus Travel) సౌకర్యాన్ని అమలు చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో మహిళా ప్రయాణికులు (Women Passengers), ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల మధ్య చోటుచేసుకుంటున్న వివాదాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ డిపోలో (Avanigadda Depot) గురువారం ఉదయం ఆర్టీసీ సిబ్బంది ఆకస్మికంగా బస్సు సర్వీసులను నిలిపివేసి నిరసన చేపట్టారు.
డిపో గేటు వద్ద డ్రైవర్లు(Drivers), కండక్టర్లు (Conductors) బైఠాయించడంతో బస్సు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు బస్టాండ్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పాఠశాలలు(Schools), కళాశాలలకు వెళ్లే విద్యార్థులు(Students) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలైనప్పటి నుంచి బస్సుల్లో అధిక రద్దీ కారణంగా ప్రతి రోజూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని ఆర్టీసీ సిబ్బంది (RTC Staff) తెలిపారు. సీట్ల కేటాయింపు, బస్సులను నిలిపే ప్రదేశాలు, ప్రయాణికుల ఎక్కింపు, దిగింపు వంటి అంశాలపై తరచూ మహిళా ప్రయాణికులతో వాగ్వాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కొన్ని సందర్భాల్లో మహిళా ప్రయాణికులు విధుల్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న తమకు కనీస భద్రత కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వహించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు.
సిబ్బందికి తగిన భద్రత కల్పించడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు హామీ ఇచ్చే వరకు బస్సులను(Buses) నడిపే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో అవనిగడ్డ డిపోలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురికాగా, సమస్య పరిష్కారానికి అధికారులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.






