తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గాత్రంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ గాయని (Legendary Singer) ఎస్. జానకి(S.Janaki) (88) ఇక లేరు. గుండెపోటుతో (Heart Attack) మైసూర్‌లోని (Mysuru) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు (Passed Away). ఈ విషాద వార్తతో సినీ పరిశ్రమతో పాటు సంగీతాభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
50 వేలకుపైగా పాటలతో సంగీత చరిత్రలో చెరగని ముద్ర
1938 ఏప్రిల్ 23న అప్పటి గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో (Pallapatla Village) జన్మించిన ఎస్. జానకి చిన్ననాటి నుంచే సంగీతంపై(Music) ఆసక్తి పెంచుకున్నారు. నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి (Paidiswamy) వద్ద సంగీతంలో శిక్షణ పొందిన ఆమె 1957లో తమిళ చిత్రం “విధియిన్ విలయాట్టు”(Vidhiyin Vilayattu) ద్వారా ప్లేబ్యాక్ సింగర్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20కుపైగా భారతీయ, విదేశీ భాషల్లో పాటలు ఆలపించి అరుదైన ఘనత సాధించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో 50 వేలకుపైగా పాటలు పాడి సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
ఘంటసాల, ఎంఎస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, రాజ్-కోటి, ఎంఎం కీరవాణి, ఏఆర్ రెహమాన్, బప్పీ లహరి వంటి దిగ్గజ సంగీత దర్శకులతో (Legendary Music Directors) కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో (S. P. Balasubrahmanyam) ఆమె ఆలపించిన యుగళ గీతాలు దక్షిణ భారత సినీ సంగీతంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాగే పీబీ శ్రీనివాస్, డాక్టర్ రాజ్‌కుమార్, కేజే యేసుదాస్ (K. J. Yesudas) వంటి ప్రముఖ గాయకులతో కలిసి ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. “బావా మరదళ్ళు” చిత్రంలోని “నీలి మేఘాలలో” పాట ఆమెకు మెలోడీ క్వీన్‌గా (Melody Queen) ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. పాటల్లో మిమిక్రీని అద్భుతంగా మేళవిస్తూ తనదైన శైలితో కోట్లాది అభిమానులను అలరించారు.
ఎన్నటికీ మరిచిపోలేని మధుర గీతాలు
“పదహారేళ్ల వయసు” చిత్రంలోని “సిరిమల్లె పువ్వా”, “పూజాఫలం”లో “పగలే వెన్నెల జగమే ఊయల”, “సిరిసిరి మువ్వ”లో “ఝుమ్మంది నాదం”, “సాగర సంగమం”లో “మౌనమేలనోయి” వంటి పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. అలాగే “ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది”, “జాబిల్లి కోసం ఆకాశమల్లే”, “మనసా తుళ్లిపడకే”, “వెన్నెల్లో గోదారి అందం”, “కన్నె పిల్లవాణి”, “గున్నమామిడి”, “నరుడా ఓ నరుడా”, “కదిలే కాలమే జీవితం”, “మేఘం తెల్లకాగితం” వంటి ఎన్నో సుమధుర గీతాలకు ఆమె గాత్రం ప్రాణం పోసింది.
4 జాతీయ అవార్డులు.. 10 నంది అవార్డులతో అరుదైన గౌరవం
ఎస్. జానకి(S.Janaki) తన సంగీత ప్రయాణంలో అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. 1986లో తమిళనాడు ప్రభుత్వం ఆమెకు కలైమామణి (Kalaimamani) బిరుదును ప్రదానం చేయగా, కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ ప్రశస్తితో సత్కరించింది. మైసూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. ఆమె మొత్తం 32కుపైగా ప్రముఖ అవార్డులు అందుకోగా, వాటిలో 4 జాతీయ అవార్డులు(National Awards, కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి 6 అవార్డులు, ఒడిశా ప్రభుత్వం నుంచి 1 అవార్డు, అలాగే 10 నంది అవార్డులు (Nandi Awards) ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె తిరస్కరించడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 1997లో ఫిలింఫేర్ అవార్డు, 2002లో అచీవర్ అవార్డు, 2005లో స్వరాలయ జేసుదాస్ ప్రత్యేక పురస్కారం, 2011లో కర్ణాటక బసవ భూషణ్ అవార్డు, 2012లో విజయా మ్యూజికల్ అవార్డు, 2013లో మా మ్యూజిక్ జీవిత సాఫల్య పురస్కారం, 2015లో సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 2017లో సేఫ్-వేటూరి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. తన మధుర గాత్రంతో తరతరాల సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్. జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మిగిలిపోనుంది.








