ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) తీవ్ర సంచలనంగా మారిన సాయికృష్ణ (Sai Krishna) లాకప్ డెత్ కేసులో (Lockup Death Case) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(SIT) విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును(CI Nagaraju) అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, తాజాగా విజయవాడ కృష్ణలంక (Krishnalanka) పోలీస్ స్టేషన్‌కు (Police Station) చెందిన క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును (Baburao) అరెస్ట్ చేశారు.
సాయికృష్ణ లాకప్ డెత్‌కు సంబంధించి బాబురావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచి మరింత లోతైన విచారణ కోసం పోలీస్ కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ లాకప్‌లో సాయికృష్ణపై జరిగిన థర్డ్ డిగ్రీ హింసలో బాబురావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తీవ్రంగా కొట్టడం వల్లే సాయికృష్ణ మరణించినట్లు దర్యాప్తులో తేలడంతో ఆయనను అరెస్ట్ చేశారు.
మరోవైపు, సాయికృష్ణ అదృశ్యంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టులో (High Court) కీలక విచారణ జరగనుంది. తన కుమారుడు కనిపించడం లేదని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి(Vijayalakshmi) హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గతంలోనే సాయికృష్ణను వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.
హైకోర్టు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించడంతో, ప్రతిపక్షం నుండి వత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితులు రావడంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను(SIT) ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో సాయికృష్ణ పోలీసుల అదుపులోనే మరణించినట్లు, అనంతరం ఘటనను దాచిపెట్టే ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించినట్లు వెల్లడైంది. దీంతో మొదట మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ వ్యవహారం లాకప్ డెత్ కేసుగా మారింది.
ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజు అరెస్ట్ కాగా, తాజాగా కానిస్టేబుల్ బాబురావు అరెస్టుతో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో మరి కొందరి పోలీసు సిబ్బంది పాత్రపై కూడా సిట్ దృష్టి సారించినట్లు సమాచారం. హైకోర్టు విచారణతో పాటు సిట్(SIT) దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాగే సాయికృష్ణ తల్లి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేయడం ప్రాదాన్యత సంతరించుకుంది.






