విజయవాడకు (Vijayawada) చెందిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) అదృశ్యం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. తన కుమారుడు ఎక్కడున్నాడో చెప్పాలని, బ్రతికి ఉంటే అప్పగించాలని, లేకపోతే కనీసం మృతదేహం లేదా బూడిద అయినా ఇవ్వాలని సాయికృష్ణ తల్లి(Mother) గాదె విజయలక్ష్మి (Vijayalakshmi) కన్నీటి పర్యంతమవుతూ చేసిన విజ్ఞప్తి ప్రజలను కలచివేస్తోంది.
మీడియాతో మాట్లాడిన ఆమె, సీఐ నాగరాజుపై(CI Nagaraju) తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడిని స్టేషన్కు తీసుకెళ్లిన తర్వాత చూపించలేదని, అతనికి ఏమైందో స్పష్టత ఇవ్వకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోరాటం పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా కాదని, ఒక అధికారిపై ఉన్న ఆరోపణలపై న్యాయం కోరడానికేనని స్పష్టం చేశారు.
సాయికృష్ణ మేనమామ నవరంగ్ (Navarang) కూడా కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు. అడ్వకేట్ కనకదుర్గ (Kanaka Durga) మాట్లాడుతూ, సాయికృష్ణపై కేవలం రెండు కేసులే ఉన్నాయని, రాజకీయాలతో అతనికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. బ్రతికి ఉంటే వ్యక్తిని, మరణించి ఉంటే మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు.
తీవ్రమైన నేరాల ఆరోపణలు ఎదుర్కొన్న మావోయిస్టు (Maoist) నేతల నుంచి ఉగ్రవాదుల వరకు చట్ట ప్రక్రియ ప్రకారం వారి మృతదేహాల విషయంలో స్పష్టమైన విధానాలు అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు సాయికృష్ణ పరిస్థితిపై అధికారికంగా స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సాయికృష్ణపై కేసులు ఉన్నాయా లేదా అనేది విచారణ, న్యాయస్థానాల పరిధిలోని అంశం. అయితే ఏ వ్యక్తిపైనా కేసులు ఉండటం వల్ల అతని ప్రాథమిక హక్కులు లేదా కుటుంబ సభ్యుల హక్కులు కోల్పోవు. ఒక వ్యక్తి అదృశ్యం లేదా మరణంపై అధికారిక సమాచారం ఇవ్వడం, కుటుంబ సభ్యులకు స్పష్టత కల్పించడం రాజ్యాంగబద్ధ పాలనలో అత్యంత ప్రాథమిక బాధ్యతగా భావించబడుతుంది.
అందుకే ప్రస్తుతం సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు? అతను సురక్షితంగా ఉన్నాడా? లేక మరేదైనా జరిగిందా? ఈ అనుమానాలకు తెరదించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉందని కుటుంబ సభ్యులు, మానవ హక్కుల కార్యకర్తలు మరియు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.






