---Advertisement---

సంజు శామ్సన్ గొప్ప మనసు.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్‌షిప్!

September 11, 2026

Summarize with AI

---Advertisement---

టీమిండియా క్రికెటర్ సంజు శామ్సన్ (Sanju Samson) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. మైదానంలో ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకునే సంజు.. సామాజిక సేవలోనూ ముందుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల (Financial Difficulties) కారణంగా యూపీఎస్సీకి(UPSC) సరైన శిక్షణ పొందలేకపోతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చాడు. దేశవ్యాప్తంగా యూపీఎస్సీకి సిద్ధమవుతున్న 1,000 మంది విద్యార్థులకు(Students) స్కాలర్‌షిప్‌లు(Scholarships) అందించనున్నాడు.

లీడ్ ఇండియా సమ్మిట్(Lead India Summit) వేదికగా సంజు శామ్సన్ ఫౌండేషన్(Sanju Samson Foundation), లీడ్ ఐఏఎస్ అకాడెమీ (Lead IAS Academy) భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ ప్రతిభావంతుడూ సివిల్ సర్వీసెస్ (Civil Services) కలను వదులుకోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు యూపీఎస్సీ పాఠ్యాంశాలతో పాటు వ్యక్తిగత మార్గదర్శకత్వం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.

సంజు శామ్సన్ సొంత ప్రాంతమైన విజింజంతో(Vizhinjam) పాటు సమీప తీరప్రాంతాల్లోని పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. యువత సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేసేలా అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నారు.

క్రికెట్‌లో తన విజయానికి ప్రతిభ, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, పట్టుదల కారణమని సంజు శామ్సన్ తెలిపారు. సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా పెట్టుకున్న యువతకు కూడా ఇవే లక్షణాలు కీలకమని పేర్కొన్నారు. దేశానికి సేవ చేయాలనుకునే యువతకు అవకాశాలు కల్పించాలన్నదే తన ఫౌండేషన్ ఉద్దేశమని చెప్పారు.

లీడ్ ఐఏఎస్ అకాడెమీకి కేరళ మాజీ డీజీపీ రిషిరాజ్ సింగ్(Rishiraj Singh), సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ స్వరూప్, మాజీ రాయబారి టి.పి. శ్రీనివాసన్ వంటి ప్రముఖుల మార్గదర్శకత్వం ఉంది. వారి పర్యవేక్షణలో విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించనున్నారు.

పాఠశాల స్థాయి నుంచే సివిల్ సర్వీసెస్‌పై అవగాహన కల్పించేందుకు లీడ్ ఐఏఎస్ జూనియర్ కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. బహిరంగ ప్రసంగం, సమకాలీన అంశాలు, విశ్లేషణాత్మక ఆలోచన, నైతిక విలువలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.

మొత్తంగా 1,000 మంది విద్యార్థులకు అందనున్న ఈ స్కాలర్‌షిప్ ద్వారా ప్రతిభావంతులైన యువత ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్ఠాత్మక సేవల్లో చేరేందుకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం పొందనున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment