---Advertisement---

దేశం ఎదుర్కొంటున్న సమస్యను జగన్ నాడే గుర్తించారు.. ‘నాడు–నేడు’పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ!

August 16, 2026

Summarize with AI

---Advertisement---

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామం నుంచి కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రారంభించిన ‘స్కూల్ ఠీక్ కరో’ ఉద్యమం ఈ అంశాన్ని మరోసారి జాతీయ స్థాయిలో ముందుకు తెచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, రహదారులు, తరగతి గదులు వంటి కనీస సదుపాయాల పరిస్థితిని పరిశీలించేందుకు చెక్‌లిస్ట్ రూపొందించి దేశవ్యాప్తంగా సమాచారం సేకరిస్తామని ఆయన ప్రకటించారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై పరిమితి విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలను ప్రస్తావిస్తూ రాజకీయ, విద్యారంగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం ప్రాధాన్యతను పలువురు ప్రస్తావిస్తున్నారు.

2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొంటూ అనేక కార్యక్రమాలను అమలు చేసింది. ‘మనబడి నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, ఫర్నిచర్, ప్రహరీ గోడలు, పెయింటింగ్, డిజిటల్ సదుపాయాలు వంటి మౌలిక వసతులను మెరుగుపరిచే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వాతావరణంతో తీర్చిదిద్దడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్ళింది.

విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా యూనిఫాం, షూస్, సాక్సులు, బెల్ట్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ వంటి విద్యా సామగ్రిని అందించింది. ఉన్నత విద్యలో పేద విద్యార్థులకు ఫీజు భారాన్ని తగ్గించేందుకు ‘జగనన్న విద్యా దీవెన’, వసతి మరియు భోజన ఖర్చులకు ‘జగనన్న వసతి దీవెన’ వంటి పథకాలను అమలు చేసింది.

అలాగే ‘జగనన్న అమ్మఒడి’ ద్వారా అర్హులైన తల్లులకు ఆర్థిక సహాయం, ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం, బాలికల కోసం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్‌కిన్స్ అందించే చర్యలు చేపట్టింది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ ద్వారా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.

విద్యా బోధనలోనూ మార్పులకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, డిజిటల్ కంటెంట్, స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ట్యాబ్‌లు వంటి సాంకేతిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించడం ద్వారా డిజిటల్ విద్యను ప్రోత్సహించే ప్రయత్నం నాటి జగన్ ప్రభుత్వం ప్రారంభించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంచే లక్ష్యంతో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, భవిష్యత్తులో ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) విధానం వైపు వెళ్లే ప్రయత్నాలను కూడా అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. విద్యార్థులను కేవలం పరీక్షలకు కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీకి సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ మార్పులను ప్రతిపాదించినట్లు నాడే తెలిపింది.

అయితే ‘స్కూల్ ఠీక్ కరో’ వంటి ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మరోసారి చర్చకు తెస్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ముందుచూపుతో విధ్యార్ధుల భవిష్యత్తు కోసం చేపట్టిన ‘నాడు–నేడు’ వంటి కార్యక్రమాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులకు సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య వంటి అంశాలు దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని వాటిని సమర్ధవంతంగా ముందుకు తీసుకుని వెళ్లడంలో జగన్ ప్రభుత్వం కృషి ఎంతో ఉందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.

కొత్త పార్లమెంటు భవనాలు, భారీ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు ఎందుకు ఉండకూడదన్న అభిజీత్ దీప్కే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పేదలు, రైతులు, కార్మికుల పిల్లలకు కూడా సమాన విద్యా అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్న వాదనకు ఈ ఉద్యమం బలం చేకూరుస్తోంది.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులపై కొత్త ఉద్యమం మొదలైన వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేందుకు గతంలో చేసిన ప్రయత్నాలను పలువురు ప్రస్తావించడం ఇప్పుడు రాజకీయంగా, విద్యారంగ పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యం ఎంత ముఖ్యమో జగన్ ఆ దిశగా ఎంతో ముందు చూపుతో అడుగులు వేశారో ఈ పరిణామాలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment