బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Former Prime Minister) షేక్ హసీనా (Sheikh Hasina) స్వదేశానికి తిరిగి వెళ్లడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్(Arrest) చేసినా, హింసించినా (Tortured) వెనక్కి తగ్గబోనని, డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. వాషింగ్టన్ (Washington) కేంద్రంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న ఆమె.. తిరిగి వెళ్లడం ప్రమాదకరమని తెలిసినా, మద్దతుదారుల పక్షాన నిలబడటం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
హసీనా స్వదేశానికి వెళ్లాలనే నిర్ణయాన్ని విరమించుకోబోనని స్పష్టం చేశారు. అయితే, ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ (Sajeeb Wazed Joy) మాత్రం తిరుగు ప్రయాణానికి ఇంకా ఖచ్చితమైన తేదీ నిర్ణయించలేదని, సరైన సమయంలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో తీవ్ర ఆందోళనలు చెలరేగడంతో హసీనా దేశాన్ని విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి భారత్‌లోనే ఉంటున్నారు. ఆందోళనల సమయంలో జరిగిన హింసకు సంబంధించిన కేసుల్లో ఆమెకు బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించినట్లు నివేదికలు వెల్లడించాయి.
తనకు ఆశ్రయం కల్పించిన భారత ప్రభుత్వం(Indian Government), ప్రజలకు (People) హసీనా కృతజ్ఞతలు తెలిపారు. 1975లో తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌తో(Sheikh Mujibur Rahman) పాటు కుటుంబ సభ్యులు హత్యకు గురైనప్పుడు, తాను, తన సోదరి భారత్‌లో(India) ఆశ్రయం పొందిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం 1981లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లినట్లు తెలిపారు.
తనపై, అవామీ లీగ్ నాయకులపై (Awami League Leaders) నమోదైన క్రిమినల్ కేసులు రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నమని హసీనా ఆరోపించారు. దేశ భవిష్యత్తును ప్రజలే నిర్ణయించాలని, స్వేచ్ఛాయుతమైన, అందరినీ భాగస్వాములను చేసే ప్రజాస్వామ్య ప్రక్రియ అవసరమని అభిప్రాయపడ్డారు.
డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లాలన్న హసీనా వ్యాఖ్యలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. అయితే, ఆమె తిరుగు ప్రయాణానికి సంబంధించిన తేదీ ఇంకా ఖరారు కాలేదని కుమారుడు వెల్లడించారు.







