ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల (Elections) నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ (SEC Notification) విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (Anil Chandra Punetha) నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలో 659 జెడ్పీటీసీ స్థానాలకు, 659 మండల ప్రజా పరిషత్‌ల పరిధిలో 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 2,81,34,518 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రాష్ట్రంలో మొత్తం 663 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. అదేవిధంగా 29 ఎంపీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించడం లేదని వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు 659 మండల కేంద్రాలు, 28 జిల్లా కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ (Webcasting) ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ప్రజా పరిషత్‌లకు 28 మంది రిటర్నింగ్ అధికారులు (Returning Officers – ROs), మండల ప్రజా పరిషత్‌లకు 687 మంది రిటర్నింగ్ అధికారులు, 1,374 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు.
పోలింగ్ విధుల నిర్వహణ కోసం 35,333 మంది ప్రిసైడింగ్ అధికారులు(Presiding Officers), 1,41,332 మంది ఇతర పోలింగ్ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు వెంకట రామకృష్ణ తేజ (Mailavarapu Venkata Ramakrishna Teja) తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 663 రెవెన్యూ మండలాలు ఉండగా, అమరావతి ప్రాంతంలోని నాలుగు మండలాలను మినహాయించి మిగిలిన 659 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. మచిలీపట్నం, ఆదోని మండలాల విభజనతోపాటు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం కావడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఎ. మల్లికార్జున(Dr. A. Mallikarjuna), ఐజీ బి. రాజకుమారి (B. Rajakumari) పాల్గొన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: అక్టోబర్ 21, 2026
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 23, 2026
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 24, 2026
తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్ల దాఖలు: అక్టోబర్ 25, 2026
అప్పీళ్ల పరిష్కారం: అక్టోబర్ 26, 2026
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 27, 2026
పోలింగ్: నవంబర్ 3, 2026
రీపోలింగ్ (అవసరమైతే): నవంబర్ 4, 2026
ఓట్ల లెక్కింపు: నవంబర్ 5, 2026








