---Advertisement---

Sheikh Hasina: షేక్ హసీనా సంచలన హెచ్చరిక.. “నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. మళ్లీ బంగ్లాదేశ్‌కు వస్తా!”

May 19, 2026

---Advertisement---

బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 2024లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం (Student Movement) కారణంగా అధికారాన్ని కోల్పోయి ప్రస్తుతం భారతదేశంలో(India) ఆశ్రయం పొందుతున్న ఆమె.. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను వెల్లడించారు. “నేను దేశం బయట ఉన్నానంటే పోరాటం ఆపేశానని ఎవరూ అనుకోవద్దు. బంగ్లాదేశ్ ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంది. చాలా త్వరలోనే నేను తిరిగి నా దేశానికి వెళ్తాను. నన్ను ఎవరూ అడ్డుకోలేరు” అంటూ ధీమా వ్యక్తం చేశారు.

తనపై అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణశిక్ష (International Crimes Tribunal) విధించినా.. తన పార్టీ అవామీ లీగ్‌పై (Awami League) నిషేధం అమల్లో ఉన్నా తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. “ఒక నాయకురాలిని దేశం వెలుపలికి పంపించొచ్చు.. కానీ ఒక సిద్ధాంతాన్ని అంతం చేయడం ఎవరి వల్లా కాదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యం తిరిగి రావాల్సిందే

తన పునరాగమనం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఖచ్చితమైన తేదీ చెప్పలేనని ఆమె వెల్లడించారు. “ముందుగా బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ (Democratic System) పునరుద్ధరించాలి. భావప్రకటన స్వేచ్ఛ, రాజకీయ హక్కులు, చట్టబద్ధమైన పాలన తిరిగి రావాలి. ఇది కేవలం నా రాజకీయ భవిష్యత్తు కోసం కాదు.. దేశ భవిష్యత్తు కోసం అవసరం” అని పేర్కొన్నారు.

అవామీ లీగ్‌పై నిషేధం విధించిన ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంపై కూడా ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “కాగితంపై ఆర్డర్ జారీ చేసి ఒక పార్టీని ముగించలేరు. అవామీ లీగ్ ప్రజల గుండెల్లో ఉంది. ఆ పార్టీ లేకపోతే అసలు బంగ్లాదేశ్ చరిత్రే వేరుగా ఉండేది” అంటూ వ్యాఖ్యానించారు.

“నాపై ఇప్పటికే 19 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. అయినా నేను భయపడి వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు మా పార్టీ కోసం నిలబడి ఉన్నారు” అని ఆమె పేర్కొన్నారు.

యూనుస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ మాజీ అధినేత ముహమ్మద్ యూనుస్‌(Muhammad Yunus) పై కూడా షేక్ హసీనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “యూనుస్ ప్రభుత్వం అవామీ లీగ్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. మా పార్టీకి చెందిన దాదాపు 600 మంది నాయకులు, కార్యకర్తలను హత్య చేశారు. 1.5 లక్షల మందిపై తప్పుడు కేసులు నమోదు చేసి జైళ్లలో పెట్టారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వేలాది మంది దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది” అని ఆరోపించారు.

దేశంలో సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొన్న వెంటనే పార్టీ నాయకులంతా మళ్లీ బంగ్లాదేశ్‌కు వస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

భారత్‌తో బంధం చారిత్రాత్మకం

భారత్ – బంగ్లాదేశ్ (India-Bangladesh) సంబంధాలపై కూడా షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. “భారత్ మా పొరుగు దేశం మాత్రమే కాదు.. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో (Liberation War) మాకు అండగా నిలిచిన మిత్రదేశం. ఆ సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేం” అని పేర్కొన్నారు.

అయితే బంగ్లాదేశ్‌లోని కొన్ని రాజకీయ మరియు తీవ్రవాద గ్రూపులు స్వార్థ రాజకీయాల కోసం భారత్(India) వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment