ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటివరకు అజేయుల్లా కనిపించిన పలువురు రాజకీయ దిగ్గజాలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ముఖ్యమంత్రులే (Sitting Chief Ministers) తమ సొంత నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల కంటే వెనుకబడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్(West Bengal), తమిళనాడు(Tamil Nadu), కేరళ (Kerala) రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఈ ట్రెండ్స్ అధికార పార్టీలకు గట్టి హెచ్చరికలుగా భావిస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే అక్కడ అధికార మార్పు దాదాపు ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి (Mamata Banerjee) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లేడీ టైగర్‌గా పేరున్న ఆమె తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో కఠిన పోటీని ఎదుర్కొంటున్నారు. ప్రారంభ రౌండ్ల నుంచే బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ప్రతి రౌండ్‌తో ఆధిక్యం మారుతున్నప్పటికీ, మొత్తానికి మమతాను వెనక్కి నెట్టే పరిస్థితి ఏర్పడటం బెంగాల్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.
తమిళనాడులో (Tamil Nadu) కూడా అదే సీన్ కనిపిస్తోంది. సీఎం ఎం.కె. స్టాలిన్ (M.K. Stalin) తన కంచుకోటగా భావించే కొళత్తూరు నియోజకవర్గంలో వెనుకబడటం పెద్ద చర్చకు దారితీసింది. ఇక్కడ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ (TVK Party) అభ్యర్థి వీఎస్. బాబు (VS Babu) ముందంజలో కొనసాగుతున్నారు. దశాబ్దాలుగా డీఎంకేకు అజేయంగా ఉన్న ఈ సీటులో స్టాలిన్ వెనుకంజలో ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేరళలో (Kerala) ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కూడా షాక్ తగిలింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని భావించిన సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) తన సొంత నియోజకవర్గం ధర్మదంలో యూడీఎఫ్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ కంటే వెనుకబడటం గమనార్హం. కేరళ చరిత్రలో హ్యాట్రిక్ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విజయన్‌కు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది.
మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతున్నాయి. సిట్టింగ్ సీఎంలకే సొంత గడ్డపై ఇలాంటి పరిస్థితి రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే గంటల్లో ఫలితాలు ఎలా మలుపుతిప్పుతాయో అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.






